Asian Games 2023: ఆసియా క్రీడల్లో నేపాల్‌తో భారత్ పోరు..

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే స్వర్ణంతో మెరిసింది.

Update: 2023-10-02 14:29 GMT

న్యూఢిల్లీ : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే స్వర్ణంతో మెరిసింది. పురుషుల జట్టు సైతం బంగారు పతకమే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా టీమ్ ఇండియా నేరుగా నాకౌట్‌ రౌండ్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దాంతో నేడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో భారత్ ఆసియా గేమ్స్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌తో టీమ్ ఇండియా పోటీపడనుంది. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఆసియా క్రీడలకు బీసీసీఐ యువ క్రికెటర్లతో కూడిన జట్టును పంపించింది. ఈ జట్టును రుతురాజ్ గైక్వాడ్ నడిపించబోతున్నాడు. అందరూ యువకులే ఉన్నప్పటికీ.. జట్టులో ప్రతిభకు కొదవలేదు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవిబిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నిరూపించుకున్నారు.

అలాగే, ఐపీఎల్‌లో సత్తాచాటిన రింకు సింగ్, రాహుల్ త్రిపాఠి‌ జట్టులో ఉన్నారు. అయితే, ప్రత్యర్థిని కూడా ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గ్రూపు దశలో ఆ జట్టు వరుసగా మంగోలియా, మాల్దీవులపై భారీ విజయాలతో జోరు మీద ఉన్నది. కెప్టెన్ రోహిత్, కుషాల్ మల్లా, ఖుషాల్ భుర్టెల్ ఫామ్‌లో ఉండగా.. బౌలర్లలో అభినాష్, సందీప్, కరణ్, సోంపాల్ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. అయితే, ఏ విధంగా చూసుకున్నా ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా‌నే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. అయితే, గైక్వాడ్ సేన అన్ని విభాగాల్లో రాణిస్తే నేపాల్‌పై విజయం నల్లేరు మీద నడకే. క్వార్టర్ ఫైనల్‌లో గెలిస్తే టీమ్ ఇండియా.. సెమీస్‌లో పాకిస్తాన్ లేదా హాంకాంగ్‌తో తలపడనుంది.


Similar News