Women's T20 World Cup : ఆ నిబంధనను ఉల్లంఘించిన అరుంధతి రెడ్డి.. మందలించిన ఐసీసీ
భారత మహిళా క్రికెటర్, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డిపై ఐసీసీ ఫైర్ అయ్యింది.
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డిపై ఐసీసీ ఫైర్ అయ్యింది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసీసీ నిబంధనను ఉల్లంఘించిన ఆమెను మందలించడంతోపాటు ఒక్క డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఆఖరి ఓవర్ వేసిన అరుంధతి.. నాలుగో బంతికి పాక్ బ్యాటర్ నిదా దార్(28)ను క్లీన్ బౌల్డ్ చేసింది. వికెట్ తీసిన ఆనందంతో సంబరాలు చేసుకున్న ఆమె పెవిలియన్‌కు వెళ్లాలంటూ నిదా దార్‌కు చూపించింది.
అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాటర్ అవుటైనప్పుడు ఆమెను అవమానపర్చడం లేదా రెచ్చగొట్టే భాష వాడటం, చర్యలు, సంజ్ఞలు చేయడం ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్టే. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 నిబంధనను అరుంధతి ఉల్లంఘించినట్టు ఐసీసీ పేర్కొంది. తొలి తప్పిదంగా ఆమెను మందలిస్తూ ఒక డీ మెరిట్ పాయింట్ ఇచ్చింది. రెండేళ్ల కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్లు పొందితే ఆటగాడిపై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించనుంది.