Records : సచిన్ రికార్డుపై కన్నేసిన జైస్వాల్.. బ్రాడ్‌మెన్ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమవుతోంది.

Update: 2024-12-03 15:13 GMT

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమవుతోంది. తొలిటెస్ట్‌లో 161 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్ సచిన్ రికార్డుపై కన్నేశాడు. ఈ ఏడాది జైస్వాల్ టెస్టుల్లో 58.18 యావరేజ్‌, 72.52 స్ట్రయిక్ రేట్‌తో 1280 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు, ఏడు అర్థసెంచరీలు నమోదు చేశాడు. అతని బెస్ట్ స్కోరు (214నాటౌట్)గా ఉంది. అయితే జైస్వాల్ మరో 282 పరుగులు చేస్తే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును అధిగమించనున్నాడు. 2010లో 14 టెస్టుల్లో 23 ఇన్నింగ్స్ ఆడి సచిన్ 78.10 యావరేజ్‌తో 1562 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఆ ఏడాది సచిన్ బెస్ట్ స్కోరు 214.

బ్రాడ్‌మెన్ రికార్డుకు చేరువలో కోహ్లీ

కోహ్లి డాన్ బ్రాడ్‌మెన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రత్యర్థి సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో డాన్‌బ్రాడ్ మెన్ 11 శతకాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 10 సెంచరీలు చేశాడు. కోహ్లీ మరో సెంచరీ చేస్తే బ్రాడ్‌మెన్ రికార్డును అధిగమించనున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో జైస్వాల్, కోహ్లీ సెంచరీలతో అదరగొట్టడంతో భారత్ 295 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడిలైడ్ టెస్ట్‌లో రాణిస్తే భారత్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఈ ఏడాది మొత్తం ఫామ్ లేమితో సతమతమైన కోహ్లీ పెర్త్ టెస్ట్‌లో సెంచరీతో మళ్లీ పుంజుకున్నాడు. ఆస్ట్రేలియాపై రాణించి తనను తాను నిరూపించుకునేందుకు జైస్వాల్ సైతం ఉవ్విళ్లూరుతున్నాడు. 

Tags:    

Similar News