ప్రధాని మోడీపై షోయాబ్ అక్తర్ ప్రశంసలు
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిన అనంతరం అభిమానులతోపాటు ఆటగాళ్లూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు..
ఇస్లామాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిన అనంతరం అభిమానులతోపాటు ఆటగాళ్లూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మహ్మద్ సిరాజ్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకోగా, రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్‌తోపాటు మిగతా ఆటగాళ్లు కన్నీళ్లను ఆపుకుంటూనే మైదానాన్ని వీడారు. ఇక, ఆ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రధాని మోడీ.. ఆస్ట్రేలియా గెలవడంతో ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌కు ట్రోఫీ అందజేశారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి నిరాశలో ఉన్న భారత ఆటగాళ్లను ఓదార్చారు. బాధలో ఉన్న ఆటగాళ్లందరి భుజం తడుతూ ‘దేశం మొత్తం మీవెంటే ఉంది’ అంటూ ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించాడు. ‘డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన ప్రధాని తాను ఆటగాళ్లతోనే ఉన్నానని చెప్పారు. దేశం మొత్తం జట్టు వెంటే ఉందన్న సందేశాన్ని ఇచ్చారు. ఇది నిజంగా వారికొక ఉద్విగ్న క్షణం. ఆటగాళ్లను తన సొంత బిడ్డల్లా దగ్గరకు తీసుకున్నాడు. వారు బాగా ఆడారని చెబుతూ ధైర్యం చెప్పారు. ఆటగాళ్లతో ప్రధాని ఎంతో గొప్పగా వ్యవహరించారు’ అని ఓ షోయాబ్ చెప్పాడు.