NZ vs SL : రెండో టీ20లోనూ శ్రీలంక చిత్తు.. టీ20 సిరీస్ కివీస్ వశం
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వరుసగా రెండో టీ20లోనూ శ్రీలంకను ఓడించి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల 45 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ముందుగా కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 స్కోరు చేసింది. మిచెల్ హే(41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చాప్‌మన్(42), టిమ్ రాబిన్సన్(41), గ్లెన్ ఫిలిప్స్(23) రాణించారు. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంకను కివీస్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో లంక జట్టు 19.1 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. కుసాల్ పెరీరా(48), నిశాంక(37) పోరాడగా.. మిగతా వారు క్రీజులో నిలువలేకపోయారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ నాలుగు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. మ్యాట్ హెన్రీ, సాంట్నర్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. జనవరి 2న నామమాత్రపు మూడో టీ20 జరగనుంది.