డ్రెస్సింగ్ రూం విభేదాలపై స్పందించిన గంభీర్.. చర్చలకు బయటకు రావొద్దని కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓటమి అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూంలో విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి.
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓటమి అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూంలో విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. భారత ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని, పరోక్షంగా కొందరి ఆటగాళ్లపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు జాతీయ మీడియాలో కథనలు వచ్చాయి. దీనిపై తాజాగా గంభీర్ స్పందించాడు. ఐదో టెస్టుకు ముందు గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని స్పష్టతనిచ్చాడు.
అలాగే, ఆటగాళ్లు, కోచ్ మధ్య చర్చలు వారి మధ్యనే ఉండాలని, డ్రెస్సింగ్ రూంకే పరిమితం కావాలని కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘డ్రెస్సింగ్ రూంలో విభేదాలు అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. అలాంటి వార్తలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ప్లేయర్లకు, కోచ్ మధ్య జరిగే చర్చలు వారి మధ్యే ఉండాలి. మాటలు డ్రెస్సింగ్ రూంకే పరిమితం చేయాలి. డ్రెస్సింగ్ రూంలో ఒకే అంశంపై చర్చ జరిగింది. తర్వాతి మ్యాచ్‌లో ఎలా గెలవాలనే దానిపై. అది మాకు చాలా ముఖ్యం.’ అని గంభీర్ తెలిపాడు. అలాగే, సిడ్నీలో విజయంపై నమ్మకంగా ఉన్నామన్నాడు. భారత డ్రెస్సింగ్ రూంలో గెలవడానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయని, భవిష్యత్తులో అద్భుతాలు చూడబోతున్నామని చెప్పాడు. ప్రతి ఆటగాడికి తమ పాత్ర ఏంటో తెలుసునని, జట్టు కోసం తమ అత్యుత్తమమైన ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడని తెలిపాడు. యువ పేసర్ ఆకాశ్ దీప్ వెన్ను నొప్పితో ఐదో టెస్టుకు దూరంగా ఉంటాడని గంభీర్ చెప్పాడు.