‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ షార్ట్‌లిస్ట్‌లో నీరజ్..

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్-2023’ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే.

Update: 2023-11-14 17:46 GMT

న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్-2023’ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఫైనల్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్న నీరజ్.. ఈ అవార్డుకు మరింత చేరువయ్యాడు. ముందుగా ఈ అవార్డుకు 11 మంది అథ్లెట్లను నామినేట్ చేయగా.. మంగళవారం వరల్డ్ అథ్లెటిక్స్ గవర్నింగ్ బాడీ అందులో ఐదుగురిని షార్ట్‌లిస్ట్ చేసింది. ‘ఈ ఐదుగురు అథ్లెటిక్స్‌లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేశారు. వరల్డ్ చాంపియన్‌షిప్, వన్డే మీటింగ్ సర్కూట్స్, ఇతర ప్రపంచ పోటీల్లో విజేతలుగా నిలవడంతోపాటు వరల్డ్ రికార్డులను బద్దలుకొట్టారు.’ అని వరల్డ్ అథ్లెటిక్స్ పేర్కొంది.

నీరజ్‌తోపాటు ర్యాన్ క్రౌజర్(అమెరికా, షాట్‌పుట్), మోండో డుప్లాంటిస్(స్వీడన్, పోల్ వాల్ట్), కెల్విన్ కిప్తుమ్(కెన్యా, మారథాన్), నోహ్ లైల్స్(అమెరికా, 100 మీటర్లు/200మీటర్లు) అవార్డుకు షార్ట్‌లిస్ట్ అయ్యారు. కాగా, ఈ ఏడాది నీరజ్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, డైమండ్ లీగ్‌లో రజతం గెలుచుకోవడంతోపాటు ఇటీవల ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. అలాగే, జావెలిన్ త్రోలో వరల్డ్ నం.1గా కొనసాగుతున్నాడు.


Similar News