ఆ విషయంలో వెనకడుగు వేయం : రోహిత్ శర్మ

కాన్‌బెర్రాకు వెళ్లిన టీమిండియాకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ ప్రత్యేక విందు ఇచ్చారు.

Update: 2024-11-28 19:42 GMT

దిశ, స్పోర్ట్స్ : తమ ఆటతో అందరినీ అలరిస్తామని, ఆ విషయంలో వెనుకడుగు వేయమని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో భారత జట్టు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ కోసం కాన్‌బెర్రాకు వెళ్లిన టీమిండియాకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ ప్రత్యేక విందు ఇచ్చారు. ఆసిస్ ప్రధాని, భారత ఆటగాళ్ల మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర అంశాల్లోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా మేం ఆసిస్‌కు వచ్చి క్రికెట్ ఆడటం, విభిన్న సంస్కృతి ఆస్వాదించడం ఆనందంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఆడటం కష్టమే. ప్రతిసారి సవాల్ తప్పదు. అయితే, గతంలోనూ ఇక్కడ విజయాలు సాధించాం. గత వారంలో తొలి టెస్టులో గెలుపొందాం. అదే జోరు కొనసాగిస్తాం. ఆస్ట్రేలియాలోని విభిన్నమైన నగరాలకు వెళ్లడం మంచి అనుభవం. ఇక్కడకు వచ్చి ఆడేందుకు చాలా ఇష్టపడుతాం. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను అలరించడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయం. క్రికెట్‌ను ఆదరించడంలో భారత్‌తో పాటు ఇక్కడి ఫ్యాన్స్ ఎప్పుడూ ముందుంటారు.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ నెల 30, డిసెంబర్ 1 తేదీల్లో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో భారత జట్టు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

Tags:    

Similar News