షమీకి బీసీసీఐ రెండు కండీషన్లు.. ఆ లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్
ఏడాదిపాటు ఆటకు దూరమైన టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మైదానంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : ఏడాదిపాటు ఆటకు దూరమైన టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మైదానంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే రంజీ మ్యాచ్ ఆడిన అతను ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టుకు లేదా మూడో టెస్టువకు అందుబాటులోకి వస్తాడని వార్తలు వచ్చాయి. టీమిండియాలోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న షమీకి బీసీసీఐ రెండు కండీషన్లు పెట్టినట్లు, వాటిని పూర్తి చేయడానికి డెడ్ లైన్ కూడా విధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షమీ అధిక బరువు ఉన్నాడని, అతను ఆసీస్ పర్యటనకు వెళ్లాలంటే బరువు తగ్డడంతోపాటు పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 'బీసీసీఐ వైద్య బృందం షమీని పర్యవేక్షిస్తోంది. అతను ఎలా బౌలింగ్ చేస్తున్నాడనే విషయాన్ని గమనిస్తోంది. మెడికల్ టీమ్ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆధారంగానే బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. అతడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే రెండు విషయాల్లో పాస్ అవ్వాల్సిందే. ప్రస్తుతం షమీ అధిక బరువుతో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలంటే అతను బరువు తగ్గాలి. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాలి. డిసెంబర్ రెండో వారం లోపే ఆ టెస్ట్‌లను క్లియర్ చేయాలి. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని షమీపై ఆందోళన లేకుండా చూడాలి.’ అని తెలిపారు.