భారత్‌తో మ్యాచ్ అక్కడ వద్దు.. ఐసీసీని కోరిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భయాందోళనలు వ్యక్తం చేసింది.
ఇస్లామాబాద్: వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భయాందోళనలు వ్యక్తం చేసింది. ఆ మ్యాచ్‌ను కోల్ కతా, చెన్నై, బెంగళూరుల్లో ఏదైనా వేదికకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు గ్రేగ్ బార్ క్లేను పీసీబీ అధ్యక్షుడు నాజమ్ సేథీ కోరారు. వన్డే వరల్డ్ కప్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేయకుండా చూసేందుకు బార్ క్లే, ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అల్లార్డిస్‌లు ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆసియా కప్‌ను ‘హైబ్రిడ్ మోడల్’లో నిర్వహించాలన్న డిమాండ్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించాలని నిర్ణయించింది.
పాక్ క్రికెటర్ల భద్రతపై ఆందోళన..
నాకౌట్ మ్యాచ్ కాకుండా ఇతర మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో పాకిస్తాన్ ఆడేది లేదని ఐసీసీకి స్పష్టం చేసినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో నిర్వహించే వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇస్తే చెన్నై, బెంగళూరు, కోల్ కతా వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని పీసీబీ కోరినట్లు తెలిసింది. అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడితే తమ క్రికెటర్ల భద్రతపై పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆసియా కప్‌లో ‘హైబ్రిడ్ మోడల్’ను అంగీకరించేట్లు బీసీసీఐని ఒప్పించాలని ఐసీసీ అధికారులను పీసీబీ కోరింది. కొత్త నిబంధన ప్రకారం.. ఐసీసీకి లభించే ఆదాయంలో పీసీబీకి తక్కువ వాటా ఇవ్వడం పట్ల నజమ్ సేథి అసంతృప్తి వ్యక్తం చేశారు.