IPL 2025 : ఆరెంజ్ అలెర్ట్.. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఐపీఎల్ శనివారం నుంచి ప్రారంభంకానుంది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 ఆరంభానికి మిగిలింది మరో రోజు మాత్రమే. శనివారం నుంచి లీగ్‌కు తెరలేవనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆరంభ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్నది. ప్రారంభ వేడుకల కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఓపెనింగ్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. గేమ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వర్షం ముప్పు బోర్డు, రెండు జట్లతోపాటు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం 80 శాతం వర్ష పడేందుకు అవకాశం ఉందని వాతావరణ నివేదికలు అంచనా వేశాయి. కోల్‌కతాలో ఉరుమెలు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. గేమ్ ప్రారంభానికి కంటే ముందు నుంచే వర్షం పడే అవకాశం ఉంది. 8-11 మధ్య భారీ వర్షం పడనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీని భారీగా నిర్వహించనున్నారు. వర్షం కారణంగా ఓపెనింగ్ సెర్మనీతోపాటు గేమ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే అభిమానులకు తీవ్ర నిరాశ తప్పదు. మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.