IPL 2025 : ఐపీఎల్ జాతరకు వేళైంది.. నేటి నుంచే షురూ
ఐపీఎల్-18వ సీజన్ నేటి నుంచి ప్రారంభంకానుంది.

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడికి వేళైంది. నేటి నుంచే 18వ సీజన్ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. మే 25న ఫైనల్ జరగనుంది. దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ సందడి చేయనుంది. 10 జట్లు 74 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 13 వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు ఏలో చెన్నయ్ సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉండగా.. గ్రూపు బిలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లను చేర్చారు. ప్రతి జట్టు గ్రూపు దశలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అందులో 7 సొంతగడ్డపై, మరో 7 బయట ఆడతాయి. అలాగే, ఒక జట్టు తమ గ్రూపులోని జట్లతో, ఇతర గ్రూపులోని ఒక జట్టుతో రెండేసి మ్యాచ్ ఆడుతుంది. ఇతర గ్రూపులోని నాలుగు జట్లతో చెరో మ్యాచ్ ఆడుతుంది.
కొత్త కెప్టెన్లు వీరే
మెగా వేలంలో నేపథ్యంలో 10 జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పలు ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే మార్చేశాయి. రజత్ పటిదార్, అక్షర్ పటేల్ తొలిసారిగా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ కోసం రజత్‌ను సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను తమ కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక, గత సీజన్‌లో కోల్‌కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను ఆ ఫ్రాంచైజీ వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేలంలో అతన్ని పంజాబ్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. ఇక, కేకేఆర్ సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానెకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. మరోవైపు, వేలంలో రిషబ్ పంత్ అన్ని రికార్డులను తిరిగరాసిన విషయం తెలిసిందే. లక్నో అతని కోసం రూ.27 కోట్లు కుమ్మరించింది. లీగ్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో ఢిల్లీకి కెప్టెన్‌గా ఉన్న అతను ఈ సారి లక్నోకు నాయకత్వం వహించబోతున్నాడు.
ఆ జట్లకు ఈ సారైనా అదృష్టం వరించేనా?
ఐపీఎల్ 17 సీజన్లు పూర్తి చేసుకున్నా.. ఇంకా తొలి టైటిల్ గెలవని జట్లు నాలుగు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలువలేదు. ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ లీగ్ ప్రారంభం నుంచి ఉండగా.. లక్నో మాత్రం 2022లో వచ్చింది. ప్రతి సీజన్‌లో ఏదో ఒక దశలో ఈ జట్లకు నిరాశ తప్పడం లేదు. గత సీజన్‌లో ఆర్సీబీ సంచలన ప్రదర్శన చేసినా ఎలిమినేటర్‌లో ఓడింది. ఢిల్లీ గత మూడు సీజన్లుగా ప్లే ఆఫ్స్ కూడా అర్హత సాధించలేకపోయింది. పంజాబ్ అయితే 2014లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత మరోసారి ప్లే ఆఫ్స్ గడప తొక్కలేదు. లక్నో తొలి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరుకుని ఆకట్టుకుంది. అయితే, గతేడాది మాత్రం గ్రూపు దశకే పరిమితమైంది. ఈ నాలుగు జట్లకు ఈ సారి కొత్త కెప్టెన్లు రావడం గమనార్హం. కొత్త సారథులు ఈ సీజన్‌లోనైనా తమ జట్ల రాత మారుస్తారో లేదో చూడాలి.
ధోనీకి ఇదే చివరి సీజనా?
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు ఐదుసార్లు టైటిల్ అందించాడు. అయితే, ఈ సీజన్ ధోనీకి చివరిదంటూ ప్రచారం జరుగుతుంది. గత రెండు, మూడు సీజన్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు వచ్చాయి రిటైర్మెంట్‌పై సమాధానం ఇవ్వడానికి ధోనీ ఎప్పుడు దాటవేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ధోనీ వయసు 43. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న అత్యధిక వయసు ఉన్న ఆటగాడు అతనే కావడం గమనార్హం. 2024 సీజన్‌కు ముందు సారథిగా తప్పుకుని యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అప్పగించాడు. వయసు దృష్ట్యా కూడా అతను ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు సీజన్లుగా గాయాలతో కూడా సతమతమయ్యాడు. ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. గత రెండు సీజన్లలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సీజన్‌లో కూడా అతను లోయర్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ సీజన్‌లో అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. వేలానికి ముందు అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. ధోనీ కాసేపే బ్యాటింగ్ చేసినా చూడటానికి అభిమానులు స్టేడియానికి పోటెత్తుతారు. ఈ సారి కూడా మాహీని చూడటానికి జట్టుతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ అతని కోసం స్టేడియాలకు క్యూకట్టడం ఖాయమే.
నిజామాబాద్, వరంగల్‌లలో ఫ్యాన్ పార్క్‌లు
ఐపీఎల్‌ను అభిమానులకు మరింత దగ్గర చేసేందుకు లీగ్ నిర్వాహకులు 2015 నుంచి ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లో ఫ్యాన్స్ కోసం స్క్రీనింగ్స్ పెట్టి స్టేడియానికి వచ్చిన అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ సారి కూడా దేశంలోని 50 నగరాల్లో ఈ ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ నుంచి నిజామాబాద్, వరంగల్ ఫ్యాన్ పార్క్‌లకు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, కాకినాడలలో ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్యాన్ పార్క్‌లకు ఎంట్రీ ఉచితం. అయితే, అందులో స్కీనింగ్స్‌తోపాటు మ్యూజిక్, ఫుడ్ కోర్టులు, కిడ్స్ ప్లే జోన్, వర్చువల్ బ్యాటింగ్ జోన్, బౌలింగ్ నెట్స్‌తోపాటు ఇతర ఏర్పాట్లు చేస్తారు. వాటికి మాత్రం చార్జ్ చేస్తారు.
హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే?
ఈ సీజన్‌లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం 9 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అందులో హైదరాబాద్ జట్టుకు సంబంధించి 7 గ్రూపు దశ మ్యాచ్‌లు ఉండగా.. రెండో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్ జట్టు తమ తొలి గ్రూపు మ్యాచ్‌లో రాజస్థాన్ తలపడనుంది. ఆ తర్వాత ఈనెల 27న లక్నోతో, ఏప్రిల్ 6న గుజరాత్‌తో, 12న పంజాబ్‌తో 23న ముంబైతో, మే 5న ఢిల్లీతో, 10న కోల్‌కతాతో ఆడనుంది. మే 20న క్వాలిఫయర్ 1, 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కూడా ఈ సారి రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో హోం గ్రౌండ్‌గా వైజాగ్‌ను ఎంచుకుంది. ఈ నెల 24న లక్నోతో, 30నహైదరాబాద్‌తో తలపడనుంది.
అన్ని వేదికల్లో ఆరంభ కార్యక్రమాలు
ఈ సీజన్ ప్రారంభ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించబోతున్నారు. మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే 13 వేదికల్లోనూ ఈ సారి ఆరంభ కార్యక్రమాలు జరగనున్నాయి. శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బెంగళూరు, కోల్‌కతా మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గంట ముందు అంటే సాయంత్రం 6 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనుంది. అలాగే, ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన గాత్రంతో అభిమానులను అలరించనుంది. సింగింగ్ సెన్సేషన్ కరణ్ ఔజ్లా కూడా ఆరంభ వేడుకల్లో భాగం కానున్నాడు.