విడాకులు తీసుకున్న చాహల్, ధనశ్రీ.. భరణం కింద ధనశ్రీకి చాహల్ అన్ని కోట్లు ఇస్తున్నాడా?
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం వారికి విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని చాహల్ తరపు లాయర్ నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. ‘వారిద్దరూ వేసిన జాయింట్ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. వారికి విడాకులు మంజూరు చేసింది. ఇకపై వారిద్దరూ భార్యభర్తలు కాదు’ అని తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇద్దరూ పరస్పర అంగీకారంతో డివోర్స్ కోసం అప్లై చేశారు. అయితే, హిందూ వివాహ చట్టం ప్రకారం.. విడాకుల మంజూరుకు ముందు ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి. పరస్పర అంగీకారంతో డివోర్స్‌కు అప్లై చేసినందున కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను రద్దు చేయాలని చాహల్, ధనశ్రీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.
గురువారంలోగా పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలోనే చాహల్, ధనశ్రీలకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టుకు హాజరైన వీరిద్దరూ డివోర్స్ అనంతరం ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. 2020 డిసెంబర్‌లో చాహల్, ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. అయితే, 2022 జూన్ నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ధనశ్రీకి భరణం కింద చాహల్ రూ.4.75 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలస్తోంది. ఇప్పటికే రూ.2.37 కోట్లు ఇచ్చినట్టు సమాచారం.