SRH VS RR : ఉప్పల్‌లో ఉగ్రరూపం చూస్తామా?.. నేడు రాజస్థాన్‌తో హైదరాబాద్ ఢీ
ఐపీఎల్-2024లో సంచలన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తృటిలో టైటిల్ కోల్పోయిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024లో సంచలన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తృటిలో టైటిల్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో కోల్‌కతా చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టింది. ఈ సారి ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలనే పంతంతో ఈ సీజన్‌కు సిద్ధమైంది. తొలి గ్రూపు మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తమ వేటను ప్రారంభించనుంది. నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి గేమ్‌లో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని హైదరాబాద్ జట్టు భావిస్తున్నది. ఈ సారి హైదరాబాద్ అంటేనే ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. ఐపీఎల్-2024లో ఆ జట్టు విధ్వంసకర ఆటతీరే అందుకు కారణం. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల వరద పారించింది. లీగ్ చరిత్రలోనే మూడుసార్లు రికార్డు హయ్యెస్ట్ స్కోరు నమోదు చేసిందంటే ఆ జట్టు ఏ విధంగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఆకట్టుకున్నాడు. హెడ్, అభిషేక్, క్లాసెన్, నితీశ్, కెప్టెన్ కమిన్స్‌లను రిటైన్ చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. వేలంలో ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపాలను తీసుకుని బలాన్ని మరింత పెంచుకుంది. గత సీజన్ పర్ఫామెన్స్ దృష్ట్యా అభిమానుల్లో ఈ సారి హైదరాబాద్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. కాబట్టి, హెడ్, అభిషేక్, క్లాసెన్‌లు ఉప్పల్ ఉగ్రరూపం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
రాజస్థాన్‌తో అంత ఈజీ కాదు
ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌ను తక్కువ అంచనా వేయడానికి రాలేదు. ఆ జట్టుతో గట్టి పోటీ తప్పదు. యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టుకు బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది. హైదరాబాద్ బౌలర్లు ఏ మేరకు ప్రత్యర్థిని కట్టడి చేస్తారన్నది కూడా కీలకమే. స్పిన్నర్ హసరంగ, పేసర్ జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. తుషార్ దేశ్‌పాండే, ఫరూఖీ, మహేశ్ తీక్షణ కూడా నాణ్యమైన బౌలర్లే.
ఎస్‌ఆర్‌హెచ్‌దే పైచేయి
రాజస్థాన్‌తో పోరులో హైదరాబాద్ జట్టుదే స్వల్ప ఆధిపత్యం. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో ఎదురుపడ్డాయి. అందులో ఎస్‌ఆర్‌హెచ్ 11 విజయాలు నమోదు చేయగా.. రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అలాగే, ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌పై హైదరాబాద్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచింది. ఈ సారి కూడా సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.
తుది జట్లు(అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ కుమార్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్,రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్(కెప్టెన్), హెట్మేయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, ఫరూఖీ, మహేశ్ తీక్షణ