అమ్మ కల.. క్రిస్టీ కోవెంట్రీ సాకారం.!
ఒలింపిక్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆఫ్రికన్ ఈతగాళ్లలో ఒకరు.

"అమ్మాయికి ఈత అవసరమా.?"..
అని ఎంతోమంది అన్నారు.
కానీ తల్లిదండ్రులు అవేవీ పట్టించుకోలేదు.
"నీకు ఏదిష్టమో అదే చెయ్ బిడ్డా"..
అని ఎంకరేజ్ చేశారు.
ఆమెనొక సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా నిలబెట్టారు.
ఆమెనే ఐవోసీ తొలి మహిళా అధ్యక్షురాలు.
- దిశ, ఫీచర్స్
అంతర్జాతీయ ఒలింపిక్ సమితి (ఐఓసీ) ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఆమె పేరు క్రిస్టీ కోవెంట్రీ. ప్రముఖ జింబాబ్వే స్విమ్మర్. రాజకీయ నాయకురాలు.. క్రీడా పరిపాలనలో కీలకమైన వ్యక్తి. ఒలింపిక్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆఫ్రికన్ ఈతగాళ్లలో ఒకరు.
పేరెంట్స్ ప్రోత్సాహం
క్రిస్టీ కోవెంట్రీ 1983 సెప్టెంబర్ 16న జింబాబ్వేలోని హరారేలో జన్మించారు. పేరెంట్స్ లిన్.. రాబ్ కోవెంట్రీ. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి క్రిస్టీకి. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. ముఖ్యంగా తల్లి. "నా బిడ్డ పెద్ద క్రీడాకారిణి కావాలి" అనేది తల్లి కలనట. క్రిస్టీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధిస్తానని తల్లితో చెప్పిందట. కానీ అమ్మాయిలు ఈత కొడితే బయట పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా.? పేరెంట్స్ సపోర్ట్‌తో చిన్నప్పుడే స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకొని స్థానిక ఈత పోటీల్లో పాల్గొనేదట క్రిస్టీ కోవెంట్రీ.
ఒలింపిక్స్ పతకాలు
డొమినికన్ కాన్వెంట్ హైస్కూల్లో చదివిన క్రిస్టీ.. అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ చేసింది. యూనివర్సిటీలో నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్‌సీఏఏ) టైటిల్స్ గెలుచుకుంది. స్విమ్మింగ్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడానికి అక్కడే పునాది పడింది. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో తొలిసారి పార్టిసిపెంట్ చేసింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొంది మూడు పతకాలు గెలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలతో మొత్తం ఏడు ఒలింపిక్స్ పతకాలు సాధించి ఆఫ్రికా ఖండం నుంచి అత్యధిక రికార్డులు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు కొట్టింది.
మరింత ఆదర్శంగా
2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో స్వర్ణం.. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రజతం.. 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లీ విభాగంలో కాంస్య పతకాలను గెలుచుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో స్వర్ణంతో వరల్డ్ రికార్డు కొట్టింది. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రజతం.. 400 మీటర్ల ఇండివిజువల్ మెడ్లీ విభాగంలో రజతం సాధించింది. 2012 ఏథెన్స్ ఒలింపిక్స్.. 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా పార్టిసిపేంట్ చేసింది. పతకాలు గెలవకపోయినప్పటికీ ఆమె స్థిరత్వం.. నిబద్ధత ఆమెను మరింత ఆదర్శంగా నిలిపాయి.
రాజకీయాల్లో్కి..
క్రిస్టీ కోవెంట్రీ 2013లో టైరోన్ సీవార్డ్‌ను పెండ్లి చేసుకుంది. పెండ్లి తర్వాత కూడా క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. క్రీడల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక క్రిస్టీ రాజకీయాల్లోకి వెళ్లింది. 2018లో జింబాబ్వే యువత.. క్రీడలు.. కళల శాఖమంత్రిగా పనిచేసింది. ఆమె నాయకత్వంలో జింబాబ్వే క్రీడా విధానాలు బలోపేతం అయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టతను పెంచడానికి కృషి చేసింది. ఒకవైపు క్రీడా స్ఫూర్తి.. ఇంకోవైపు రాజకీయాలు.. మరోవైపు దేశభక్తితో సంపూర్ణ నాయకురాలిగా ఆమె గుర్తింపు సాధించింది.
సాంప్రదాయాల పట్ల
క్రిస్టీకి జింబాబ్వే సాంప్రదాయాలంటే ఎంతో గౌరవం. ఆమె పెండ్లిల "లోబోలా" సాంప్రదాయం ప్రకారం జరిగింది. "లోబోలా" అంటే వధూ మూల్యం. వరుడి ఇంటివాళ్లు ఒక ఆవును.. రెండు కోళ్లను క్రిస్టీ తండ్రి రాబ్‌కు చెల్లించారు. లోకల్ కల్చరే అయినప్పటికీ తనకు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవాన్ని ఈ తంతు చాటిచెప్పింది. 2015లో భర్తతో కలిసి "క్రిస్టీ కోవెంట్రీ అకాడమీ"ని స్థాపించింది. దీని ద్వారా ఈతలో శిక్షణ ఇస్తున్నారు. "హీరోస్" అనే కార్యక్రమం ద్వారా వెనకబడిన తరగతుల పిల్లలకు ఉచిత క్రీడా కార్యక్రమాలు అందిస్తున్నారు.
ఐఓసీ అధ్యక్షురాలిగా
2013లో ఐఓసీ అథ్లెట్ కమిషన్లో సభ్యురాలిగా ఎన్నికైన క్రిస్టీ క్రీడా కారుల హక్కులను కాపాడటానికి.. ఒలింపిక్ ఉద్యమంలో మద్దతు ఇవ్వడానికి కృషి చేసింది. ఆమెలోని నాయకత్వ లక్షణాలు.. క్రీడా అనుభవం ఐఓసీలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. ఆమె కృషిని గుర్తించిన సంస్థ 2025 మార్చి 20న ఐఓసీ అధ్యక్షురాలిగా నియమించింది. 1894లో ఐఓసీ స్థాపించినప్పటి నుంచి అంతా పురుషులే అధ్యక్షులుగా ఉన్నారు. తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్రలో చెరగని ముద్ర వేసింది క్రిస్టీ. క్రీడా పరిపాలనలో ఆమె సాధించిన గొప్ప విజయం ఇది.