IPL 2025 : బౌలర్లకు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్‌లో తీసుకొచ్చే రూల్స్ ఇవే
ఐపీఎల్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సలైవా(ఉమ్మి)పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ముంబైలో గురువారం ఐపీఎల్ కెప్టెన్లు, మేనేజర్లతో బీసీసీఐ సమావేశమైంది. ఈ సీజన్‌లో కొత్త రూల్స్‌ను వారికి వివరించింది. బోర్డు సలైవాపై నిషేధాన్ని రద్దు చేసినట్టు ఆ సమావేశానికి హాజరైన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కొవిడ్-19 సమయంలో 2020లో ఐసీసీ బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌లో కూడా బీసీసీఐ దీన్ని అమలు చేసింది.
కరోనా తగ్గిన తర్వాత కూడా సలైవాపై బ్యాన్ కొనసాగింది. అయితే, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఉమ్మిపై బ్యాన్‌ను ఎత్తేవేయాలని కోరాడు. పలుమార్లు ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్టు తెలిపాడు. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ బౌలర్లు వెర్నాన్ ఫిలాండర్, టిమ్ సౌథీ కూడా షమీ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ చర్చ చేపట్టిన బీసీసీఐ ఐపీఎల్-2025లో ఉమ్మిపై బ్యాన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం బౌలర్లకు అదనపు ప్రయోజనాన్ని కలిగించనుంది. రివర్స్ స్వింగ్ చేయడానికి బౌలర్లు బంతికి ఉమ్మిని రాస్తారు.
రెండో ఇన్నింగ్స్‌లో రెండో బాల్
ఈ సీజన్‌లో బీసీసీఐ కొత్త రూల్‌ను తీసుకరానుంది. ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌కు ఒకటి చొప్పున రెండు బంతులు వాడుతున్నారు. రాత్రి పూట జరిగే మ్యాచ్‌ల్లో మంచు ఎఫెక్ట్ కారణంగా బంతిపై బౌలర్లకు పట్టు చిక్కడం లేదు. దీనివల్ల చేజింగ్ జట్టుకు ప్రయోజనం కలుగుతుందన్న వాదన ఉంది. అందుకే, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి అదే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మ్యాచ్‌లో మంచు ప్రభావాన్ని తగ్గించడానికి బోర్డు కొత్త నిబంధనను ఈ సీజన్‌లో అమలు చేయనుంది.
రెండో ఇన్నింగ్స్‌లో రెండో బంతిని వాడేందుకు అనుమతినిచ్చింది. అయితే, సెకండ్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ తర్వాత రెండో బంతిని ఇస్తారు. అయితే, బంతి మార్పు అనేది బీసీసీఐ అంపైర్ల నిర్ణయానికి వదిలేసింది. ‘బంతిని మార్చాలా వద్దా అనేది అంపైర్ల నిర్ణయం. మంచు ప్రభావాన్ని బట్టి వారు నిర్ణయిస్తారు.’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాత్రిపూట మ్యాచ్‌లకే ఈ రూల్ వర్తించనుంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌ల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండో బాల్‌ను వాడే అవకాశం రాకపోవచ్చు.