Mohammed Shami : ఆత్మహత్య చేసుకోవాలనుకున్న షమీ.. షాకింగ్ న్యూస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ 2018లో కష్టకాలం చూశాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ 2018లో కష్టకాలం చూశాడు. వ్యక్తిగత జీవితం, క్రికెట్ కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతని భార్య హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టడంతోపాటు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు షమీ కెరీర్‌ను కుదిపేశాయి. ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ షమీకి క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే, ఆ సమయంలో షమీ మానసికంగా కుంగిపోయాడట. ఆత్మహత్యకు కూడా యత్నించాడట. ఈ విషయాన్ని షమీ బెస్ట్ ఫ్రెండ్, ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే ఉమేశ్ కుమార్ వెల్లడించారు.
తాజాగా ఓ ఇంటర్యూలో ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలతో షమీ మానసికంగా కుమిలిపోయాడని తెలిపారు. ‘ఆ సమయంలో షమీ అన్నింటితో పోరాడాడు. అతను నా ఇంట్లో నాతోనే ఉండేవాడు. కానీ, పాకిస్తాన్‌తో ఫిక్సింగ్ ఆరోపణలు రావడం అతన్ని కుంగదీసింది. ‘నేను ఏదైనా సహించగలను. కానీ నా దేశానికి నమ్మకద్రోహం చేశానన్న ఆరోపణలు సహించలేకపోతున్నాను’ అని షమీ నాతో అన్నాడు.’ అని ఉమేశ్ కుమార్ తెలిపారు.
అలాగే, షమీ ఆత్మహత్యకు పాల్పడినట్టు వచ్చిన వార్తలపై ఉమేశ్ కుమార్ స్పందించారు. ఆ సమయంలో ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘ఆ రోజు రాత్రి అతను కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాడనిపించింది. నీళ్లు తాగడానికి లేచాను. అప్పుడు ఉదయం 4 గంటలు అవుతుంది. నేను కిచెన్‌లోకి వెళ్తుండగా షమీ బాల్కనీలో నిల్చుని ఉండటాన్ని చూశా. మేము 19వ అంతస్తులో ఉంటున్నాం. అతను ఏం ఆలోచించాడో నాకు అర్థమైంది. షమీ కెరీర్‌లో ఆ రాత్రి సుదీర్ఘమైనది. ఆ తర్వాత ఓ రోజు విచారణ కమిటీ నుంచి క్లీన్ చీట్ మెసేజ్ వచ్చింది. అప్పుడు షమీ వరల్డ్ కప్ గెలిచినంత ఆనందపడ్డాడు.’ అని చెప్పుకొచ్చారు.
కాగా, గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శన చేసిన షమీ 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశాడు. టోర్నీ తర్వాత చీల మండలం గాయానికి గురై జట్టుకు దూరమయ్యాడు. గాయానికి సర్జరీ చేయించుకున్న అతను ప్రస్తుతం నేషనల్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఇటీవల బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.