జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన తెలుగు కుర్రాడు..

తెలుగు కుర్రాడు, విజయవాడకు చెందిన మద్దినేని ఉమామహేశ్ సత్తాచాటాడు.

Update: 2023-07-18 16:49 GMT

చాంగ్వాన్ : తెలుగు కుర్రాడు, విజయవాడకు చెందిన మద్దినేని ఉమామహేశ్ సత్తాచాటాడు. కొరియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్ఎఫ్) జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ పురుషుల వ్యక్తిగత కేటగిరీలో ఉమామహేశ్ 229.0 పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 627.9 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచిన ఉమా మహేశ్ ఫైనల్‌‌లో తనకంటే ఎక్కువ స్కోరు చేసిన వారిని వెనక్కినెట్టడం గమనార్హం. ఫ్రాన్స్ షూటర్ రొమెయిన్(251.2) స్వర్ణం గెలుచుకున్నాడు.

ఇదే కేటగిరీ టీమ్ ఈవెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. అభినవ్, ధనుష్ శ్రీకాంత్, రాకేశ్‌లతో కూడిన భారత త్రయం 1886.7 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది. దాంతో ఈ టోర్నీలో భారత్ ఖాతాలో నాలుగో గోల్డ్ మెడల్ చేరింది. చైనా జట్టు 1883.5 పాయింట్స్‌తో రజతం, కొరియా జట్టు 1873.9 పాయింట్స్‌తో కాంస్యం సాధించాయి. అలాగే, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో సోనమ్, గౌతమి, స్వాతి చౌదరిలతో కూడిన భారత జట్టు 1886.8 పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. అలాగే, మహిళల స్కీట్ ఈవెంట్‌లో భారత షూటర్ రైజా దిల్లానా సిల్వర్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో స్వర్ణం గెలిచిన మిరోస్లోవా(స్లోవేకియా)తో కలిసి రైజా మొదట 51 పాయింట్స్‌తో సమంగా నిలిచింది. అయితే, షూటౌట్‌లో రైజా వెనకబడటంతో రజతంతో సరిపెట్టింది.


Similar News