Bumrah : బుమ్రాకు ఇసా గుహ క్షమాపణలు.. వివాదానికి పుల్‌స్టాప్
ఇంగ్లాండ్ మహిళా వ్యాఖ్యాత ఇసా గుహ భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ మహిళా వ్యాఖ్యాత ఇసా గుహ భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు. గబ్బా టెస్ట్ రెండో రోజు కామెంట్రీ చెబుతుండగా బుమ్రాని ఉద్దేశిస్తూ గుహ ‘మోస్ట్ వాల్యబుల్ ప్రిమేట్’ అని అన్నారు. చింపాజీ క్యారెక్టర్‌తో వచ్చిన ఆంగ్ల హాస్య చిత్రం పేరు అదే కావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. భారత క్రికెట్ అభిమానులు ఆ పదం వాడినందుకు గుహపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా వివాదం నేపథ్యంలో గుహ సోమవారం బుమ్రాకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ‘నిన్న కామెంట్రీ చెబుతుండగా ఒక పదాన్ని వాడాను. అది విపరీత అర్థాలకు దారి తీసింది. ఎవరైనా నొచ్చుకుంటే క్షమాపణలు కోరుతున్నా.. ఇతరులకు గౌరవం విషయంలో ఉన్నత ప్రమాణాలను ఏర్పరుచుకున్నా. బుమ్రాను ప్రశంసించే క్రమంలో తప్పు పదాన్ని ఎంచుకున్నాను. సౌత్ ఆసియా వారసత్వం కలిగిన వ్యక్తిగా ఎలాంటి దురాలోచనతో ఈ వ్యాఖ్యలు చేయలేదు. అద్భుతంగా సాగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు తన వ్యాఖ్యలు నష్టం చేయవని భావిస్తున్నా..’అని గుహ అన్నారు. ఇక గుహ క్షమాపణలు చెప్పడాన్ని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. లైవ్ టెలికాస్ట్‌లో క్షమాపణలు చెప్పడం అద్భుతమన్నాడు. పొరపాట్లు సహజం.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలన్నాడు.