Irani Trophy 2023: ఇరానీ ట్రోఫీ 2023 విజేత 'రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా'..

ఇరానీ ట్రోఫీ 2023 విజేతగా రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా నిలిచింది.

Update: 2023-10-03 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇరానీ ట్రోఫీ 2023 విజేతగా రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా నిలిచింది. డిఫెండింగ్‌ రంజీ ఛాంపియన్స్‌ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకు ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా.. సాయి సుదర్శన్‌ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (32), హనుమ విహారి (33), శ్రీకర్‌ భరత్‌ (36), షమ్స్‌ ములానీ (32), సౌరభ్‌ కుమార్‌ (39) మిగిలిన బ్యటార్లు రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో.. పార్థ్‌ భట్‌ 5 వికెట్లు తీయగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్‌ సింగ్‌ దోడియా 2 వికెట్లు తీశారు.

అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్‌ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్‌ వ్యాస్‌ (29), చతేశ్వర్‌ పుజారా (29), ప్రేరక్‌ మన్కడ్‌ (29), పార్థ్‌ భట్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్‌ కావేరప్ప (3/28), సౌరభ్‌ కుమార్‌ (4/65), షమ్స్‌ ములానీ (2/47), పుల్కిత్‌ నారంగ్‌ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు.

అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాను పార్థ్‌ భట్‌ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్‌ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్‌ ఖాన్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది.


Similar News