కేకేఆర్, ఎల్ఎస్జీ మ్యాచ్ రీషెడ్యూల్?
ఇండియన్ సూపర్ లీగ్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ జట్టు కూడా సంజీవ్ గోయాంకాదే. అందుకే ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.

- ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్‌లో మ్యాచ్
- శ్రీరామనవమి కారణంగా సెక్యూరిటీ ఇవ్వలేమన్న పోలీసులు
- మ్యాచ్ పోస్ట్ పోన్ చేయడానికి కసరత్తు
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మధ్య ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా మ్యాచ్‌కు అదనపు భద్రత ఇవ్వడం సాధ్యం కాదని కోల్‌కతా పోలీసులు చెప్పడంతో.. ఆ రోజు జరగాల్సిన మ్యాచ్‌ను వేరే రోజుకు మారుస్తారనే చర్చ జరుగుతుంది. మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్‌లోనే కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య జరుగనుంది. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రెసిడెంట్ స్నేహాశిష్ గంగూలీ మాట్లాడతుూ.. రామ నవమి రోజు కోల్‌కతా పోలీసులు మ్యాచ్‌కు పూర్తి భద్రత కల్పించలేక పోవచ్చని అన్నారు. బీజేపీ నేత సువేంద్రు అధికారి కూడా మ్యాచ్‌పై స్పందించారు. శ్రీరామనవమి రోజు 20వేలకు పైగా ర్యాలీలు జరుగుతాయని అన్నారు. నగర వ్యాప్తంగా పోలీసులు ఆ ర్యాలీల భద్రతలో నిమగ్నమై ఉంటారని, ఇక మ్యాచ్‌కు ఎలా భద్రత కల్పించగలరని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే కోల్‌కతా సిటీ పోలీసులతో క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహాశిష్ గంగూలీ రెండు సార్లు చర్చలు జరిపారు. మార్చి 18న జరిగిన సమావేశంలో కేకేఆర్, ఎల్ఎస్జీ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది. శ్రీరామనవమి రోజు మ్యాచ్ చూడటానికి వచ్చే 65 వేల మందిని కంట్రోల్ చేయగలిగేంత మంది సిబ్బందిని నియమించలేమని చెప్పినట్లు క్యాబ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు గంగూలీ తెలిపారు. గతేడాది కూడా శ్రీరామనవవి సందర్భంగా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు. అయితే మ్యాచ్‌కు ఇంకా సమయం ఉండటంతో బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని అన్నారు. ఇక కేకేఆర్, ఎల్ఎస్జీ మ్యాచ్ కోసం లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల జట్టు లక్నో బేస్ అయినా.. కోల్‌కతాలో కూడా భారీగా మద్దతు ఉంది. ఇండియన్ సూపర్ లీగ్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ జట్టు కూడా సంజీవ్ గోయాంకాదే. అందుకే ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.