ఆసియా గేమ్స్‌కు భారత ఫుట్‌బాల్ జట్లు దూరం..

ఈ ఏడాది చైనాలో జరగబోయే ఆసియా గేమ్స్‌కు భారత పురుషుల, మహిళల జాతీయ ఫుట్‌బాల్ జట్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Update: 2023-07-16 13:52 GMT

న్యూఢిల్లీ : ఈ ఏడాది చైనాలో జరగబోయే ఆసియా గేమ్స్‌కు భారత పురుషుల, మహిళల జాతీయ ఫుట్‌బాల్ జట్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆసియా టాప్-8 జట్లలో లేని కారణంగా ఆసియా గేమ్స్‌కు భారత జట్లను పంపేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నిరాకరిస్తున్నది. ఆయా క్రీడల్లో ఆసియా టాప్-8 జట్లలో ఉంటేనే ఆసియా క్రీడలకు పంపించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఐఓఏతోపాటు వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలకు తెలిపింది. ప్రస్తుతం ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 18వ స్థానంలో ఉండగా.. మహిళల జట్టు 10వ స్థానంలో ఉన్నది.

కేంద్ర క్రీడా మంత్రిత్వి శాఖ నిబంధనన ప్రకారం ఆసియా గేమ్స్‌‌కు భారత జట్లు దూరం కానున్నాయి. అయితే, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరతామని భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) జనరల్ సెక్రెటరీ షాజీ ప్రభాకరన్ తెలిపారు. ‘ఈ ఏడాది భారత జట్ల ప్రదర్శన ప్రోత్సాహకరంగా ఉంది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనడం భారత ఫుట్‌బాల్‌కు, ముఖ్యంగా అండర్-23 ప్లేయర్లకు మంచి అవకాశం.’ అని పేర్కొన్నారు. కాగా, ఇదే కారణంతో 2018 ఆసియా క్రీడల్లో భారత్ పాల్గొనలేదు. టోర్నీ చరిత్రలో భారత ఫుట్‌బాల్ జట్టు పాల్గొనకపోవడం అదే తొలిసారి.


Similar News