IND vs PAK: సెంచరీలతో చెలరేగిన భారత్ బ్యాటర్లు.. పాక్ టార్గెట్ ఇదే
ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు భారత బ్యాటర్లు.
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు భారత బ్యాటర్లు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో వచ్చిన కెఎల్ రాహుల్ సెంచరీలతో మోత మోగించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకి భారీ స్కోరు అందించారు. విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేయగా.. కెఎల్ రాహుల్ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ 194 బంతుల్లో 233 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది టీమిండియా. వన్డేల్లో పాకిస్తాన్‌పై టీమిండియాకి ఇదే అత్యధిక స్కోరు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదటి మ్యాచ్ ఆడుతున్న కెఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో కెఎల్ రాహుల్‌కి ఇది ఆరో సెంచరీ.. విరాట్ కోహ్లీ వన్డేల్లో 47వ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. 24.1 ఓవర్లలో 147/2 స్కోరుతో రిజర్వు డే ఆటని కొనసాగించిన భారత బ్యాటర్లు రాహుల్, కోహ్లీ.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించింది. దీంతో పాకిస్థాన్‌కు 357 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.