టీమ్ ఇండియా హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్.. ఆ జట్లతోనే పోరు

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్ ఇండియా ఆ తర్వాత కూడా బిజీబిజీగా గడపనుంది.

Update: 2024-06-20 12:17 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్ ఇండియా ఆ తర్వాత కూడా బిజీబిజీగా గడపనుంది. 2024-25కు సంబంధించిన హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్‌లో బంగ్లాతో టెస్టు సిరీస్‌తో టీమిండియా హోం సీజన్ ప్రారంభకానుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు బంగ్లాతో రెండు టెస్టులు ఆడనుంది. ఆ మ్యాచ్‌లకు చెన్నయ్, కాన్పూర్ వేదికలు. ఆ తర్వాత అదే జట్టుతో మూడు టీ20ల సిరీస్‌లో పాల్గొంటుంది. ధర్మశాల, ఢిల్లీ వేదికలుగా అక్టోబర్ 6న, 9న తొలి రెండు టీ20ల జరగనున్నాయి. ఇక, అక్టోబర్ 12న జరిగే ఆఖరిదైన మూడో టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది.

మూడు రోజుల విరామం అనంతరం అక్టోబర్ 16 నుంచి నవంబర్ 1 వరకు న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఆ మ్యాచ్‌లకు బెంగళూరు, పూణె, ముంబై వేదికలుగా ఎంపికయ్యాయి. ఇక, వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఖరారైంది. టీ20 మ్యాచ్‌లకు చెన్నయ్, కోల్‌కతా, రాజ్‌కోట్, పూణె, ముంబై వేదిక కానుండగా.. నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్‌ల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ టీమ్ ఇండియాకు సన్నాహకంగా ఉపయోగపడనుంది.


Similar News