Badminton Asia Junior Championships 2023: క్వార్టర్స్‌లో భారత్ ఓటమి..

ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్ సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది.

Update: 2023-07-10 15:24 GMT

యోగ్యకర్త : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్ సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్ర్కమించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 1-3 తేడాతో ఆతిథ్య ఇండోనేషియా చేతిలో పోరాడి ఓడింది. ముందుగా మిక్స్‌డ్ డబుల్స్‌లో మ్యాచ్‌లో భారత జోడీ సమర్‌వీర్-రాధిక శర్మ 16-21, 15-21 తేడాతో అడ్రియన్ ప్రతమ-ఫెలిషా అల్బెర్టా చేతిలో ఓడింది. ఆ తర్వాత మెన్స్ సింగిల్స్‌ మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21-18, 15-21, 19-21 తేడాతో అల్వీ ఫర్హాన్ చేతిలో ఓడటంతో భారత్ 0-2 తేడాతో వెనుకబడింది. దాంతో తప్పక గెలవాల్సిన ఉమెన్స్ సింగిల్స్‌ మ్యాచ్‌లో రక్షిత శ్రీ సంచలన ప్రదర్శన చేసింది.

రుజానాపై 21-18, 10-21, 23-21 తేడాతో గెలిచి భారత్‌ను పోటీలో నిలబెట్టింది. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో పురుషుల జోడీ నిరాశపర్చడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. మెన్స్ డబుల్స్‌ మ్యాచ్‌లో దివ్యమ్ అరోరా-మయాంక్ రానా జోడీ 10-21, 21-15, 21-12 తేడాతో మహ్మద్ అల్ ఫర్జి-నికోలస్ జోక్విన్ చేతిలో ఓడిపోయింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఓటమి ఖరారైంది. సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండోనేషియా అక్కడ థాయిలాండ్‌‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే ఫైనల్‌లో ఇండోనేషియా, జపాన్ తలపడనున్నాయి.


Similar News