సెమీస్‌కు భారత్.. రెండో గ్రూపు మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం

Update: 2023-07-17 14:56 GMT

కొలంబో : పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో భారత ‘ఏ’ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గ్రూపు-బి తొలి మ్యాచ్‌లో యూఏఈపై విజయంతో టోర్నీలో శుభారంభం చేసిన భారత్.. రెండో గ్రూపు మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసి మరో మ్యాచ్ ఉండగానే నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించింది. సోమవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో భారత ‘ఏ’ జట్టు విజయం సాధించింది. నేపాల్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.1 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ నెల 19న జరిగే చివరి గ్రూపు మ్యాచ్‌లో భారత ఏ జట్టు.. పాకిస్తాన్ ఏ జట్టుతో తలపడనుంది.

భారత ఏ జట్టు ఆల్‌రౌండ్ షో..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్‌ బ్యాటర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు.39.2 ఓవర్లలోనే ప్రత్యర్థిని 167 పరుగులకే ఆలౌట్ చేశారంటే భారత బౌలర్లు ఏ విధంగా విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. నిశాంత్ సింధు(4/14), హంగర్గేకర్(3/25), హర్షిత్ రానా (2/16) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. తొలి ఓవర్‌లో రెండో బంతికే కుశాల్ భుర్టెల్(0)ను పెవిలియన్ పంపి హర్షిత్ రానా నేపాల్‌కు గట్టి షాకివ్వగా.. హంగర్గేకర్, నిశాంత్ వరుస వికెట్లతో చెలరేగారు. ఈ క్రమంలో 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి నేపాల్ తీవ్ర కష్టాల్లో పడింది.

100 పరుగులైన చేస్తుందా అనుకున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ పాడెల్(65), గుల్సాన్ ఝా(38) రాణించడంతో నేపాల్ కష్టంగా 167 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం భారత ఏ జట్టులో బ్యాటుతో సత్తాచాటింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(58 నాటౌట్), అభిషేక్ శర్మ(87) జట్టుకు శుభారంభం అందించారు. నేపాల్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్‌కు 139 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించింది. అభిషేక్ అవుటైనా.. క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(21 నాటౌట్)తో కలిసి సాయి సుదర్శన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 22.1 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.


Similar News