వివాదాల్లో.. విశ్వక్రీడలు.. అథ్లెట్లను లక్ష్యం చేసుకుంటున్న దొంగలు

పారిస్‌లో 33వ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

Update: 2024-08-20 15:50 GMT

‌‌పారిస్‌లో 33వ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వక్రీడలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఒలింపిక్స్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్టేడియంలో కాకుండా సెయిన్ నదిలో ప్రారంభ వేడుకలను నిర్వహించడం దగ్గరి నుంచి పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అయితే, అదంతా ఒకవైపే. మరోవైపు, ఈ విశ్వక్రీడల చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ ఆతిథ్యమిస్తున్నది. తొలిసారిగా 1900లో, చివరిసారిగా 1924 విశ్వక్రీడలు జరిగాయి. శతాబ్దం తర్వాత జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో వరుస వివాదాలు మచ్చగా మారుతున్నాయి.

- హరీశ్

అథ్లెట్ల లక్ష్యంగా దొంగతనాలు

పారిస్‌లో ఒకవైపు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతుండగా మరోవైపు అథ్లెట్లే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయి. అర్జెంటీనా ఫుట్‌బాల్ ట్రైనింగ్ క్యాంప్‌లో దొంగతనం జరిగింది. ఈ నెల 24న మొరాకో, అర్జెంటీనా మ్యాచ్‌కు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. తాము ట్రైనింగ్ కోసం వెళ్లిన సమయంలో దొంగతనం జరిగిందని, దొంగలించిన వస్తువుల్లో మిడ్ ఫీల్డర్ థియోగో అల్మాడా వాచ్ కూడా ఉందని అర్జెంటీనా కోచ్ జెవియారో మస్చెరానో తెలిపాడు. మరోవైపు, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం జికోకు సంబంధించిన విలువైన వస్తువులు ఉన్న బ్రీప్ కేసు దొంగతనానికి గురైంది. పారిస్ మీడియా కథనాల ప్రకారం.. 71 ఏళ్ల జికో హోటల్ నుంచి ఓ కార్యక్రమానికి ట్యాక్సీలో వెళ్తుండగా అతని బ్రీఫ్కేసును దొంగలు దోచుకున్నారు. ట్యాక్సీ‌ని ఫాలో అయిన ఇద్దరు దొంగల్లో ఒకరు డ్రైవర్‌ దృష్టిని మరల్చగా.. మరో వ్యక్తి వెనుక నుంచి బ్రీఫ్కేసును ఎత్తుకెళ్లాడు. ఆ బ్రీఫ్ కేసులో డైమండ్ నెక్లెస్, డబ్బు, లగ్జరీ రోలెక్స్ వాచ్ ఉన్నట్టు సమాచారం. వాటి విలువ 500,000 యూరోలు(దాదాపు 4.5 కోట్లు) ఉంటుందని అక్కడి మీడియా తెలిపింది.

ఇజ్రాయెల్‌ అథ్లెట్లకు స్వాగతం పలకం : ఫ్రాన్స్ ఎంపీ

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్‌లపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) నిషేధం విధించింది. అయితే, ఆ దేశ అథ్లెట్లు తమ దేశం తరపున కాకుండా వ్యక్తిగత తటస్థ క్రీడాకారులుగా విశ్వక్రీడల్లో పాల్గొన్నారు. అదే సమయంలో గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ను కూడా బ్యాన్ చేయాలని పాలస్తీనా డిమాండ్ చేస్తున్నది. పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు ఇజ్రాయెల్ అథ్లెట్లపై ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టెన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ర్యాలీలో థామస్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలకబోమని వ్యాఖ్యానించాడు. ‘ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై నిషేధం విధించేలా ఐవోసీపై ఫ్రాన్స్‌ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తేవాలి. రష్యా విషయంలో తీసుకున్న చర్యలు తీసుకోవాలి.’ అని తెలిపారు. ఒక దేశానికి మద్దతుగా థామస్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఒలింపిక్స్ లో రేపిస్ట్

నెదర్లాండ్స్కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్ స్టీవెన్ వాన్ డి వెల్డే ఒలింపిక్స్‌లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. పదేళ్ల క్రితం అతను ఓ మైనర్‌పై అత్యాచారం చేయడమే అందుకు కారణం. 2014లో వాన్ డి వెల్డే 19 ఏళ్ల వయసులో బ్రిటన్‌కు చెందిన 12 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ కేసులో అతను నాలుగేళ్ల శిక్ష కూడా అనుభవించాడు. విడుదలయ్యాక నెదర్లాండ్స్ బీచ్ వాలీబాల్ జట్టుకు ఆడుతున్నాడు. నెదర్లాండ్స్ ఒలింపిక్ కమిటీ అతన్ని విశ్వక్రీడలకు ఎంపిక చేసిన జట్టులో చేర్చింది. రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఒలింపిక్స్లో పాల్గొనడంపై మహిళల, క్రీడా హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

లాస్ట్ సప్పర్ పేరడీపై విమర్శల వెల్లువ

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన ‘లాస్ట్ సప్పర్’ పేరడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటలీ చిత్రకారుడు డా విన్సీ గీసిన జీసెస్ ఫొటో ఆధారంగా డ్రాగ్ క్వీన్ క‌ళాకారులు లాస్ట్ సప్పర్ పేర‌డీ చేశారు. భారీ టేబుల్ ముందు జీసెస్‌తో పాటు 12 మంది శిష్యులు భోజ‌నం చేసిన‌ట్లుగానే కళాకారులు ప్రదర్శన చేశారు. వినోదం కోసం చేసిన ఈ పేరడీపై క్రైస్తవ కమ్యూనిటీ భగ్గుమంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను అవమానించినట్లేనని సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ తన తలపై భారీ వెండి కవచాన్ని ధరించడం, ఆ ప్రదర్శనలో బాలికను ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి.

నిర్వాహకుల పొరపాట్లు

ఒలింపిక్స్ లో నిర్వాహకులు పొరపాట్లు కూడా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ప్రారంభ వేడుకలో సెయిన్ నదిలో నిర్వహించిన పరేడ్‌లో దక్షిణ కొరియా అథ్లెట్ల బృందాన్ని నిర్వాహకులు డెమోక్రాటిక్ పీపుల్స్ ఆఫ్ కొరియాగా పరిచయం చేశారు. దక్షిణ కొరియాను రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా పిలుస్తారు. డెమోక్రాటిక్ పీపుల్స్ ఆఫ్ కొరియా అంటే ఉత్తర కొరియా. పేరు విషయంలో గందరగోళానికి గురైన నిర్వాహకులు పొరపాటు చేశారు. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పింది. అలాగే, సౌత్ సుడాన్ జాతీయ గీతంలో నిర్వాహకులు పొరపాటు చేశారు. సౌత్ సుడాన్, ప్యూర్టో రికో మధ్య బాస్కెట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా సౌత్ సుడాన్ దేశానికి సంబంధించిన జాతీయ గీతం కాకుండా వేరేది ప్లే చేశారు. దీంతో ఆ దేశ అభిమానులు, ఆటగాళ్లు అయోమయానికి గురయ్యారు. వెంటనే ఫ్యాన్స్ సౌత్ సుడాన్ జాతీయ జెండా ప్రదర్శించడంతోపాటు చప్పట్లతో నిరసన తెలిపారు. దీంతో తేరుకున్న నిర్వాహకులు సరైన గీతాన్ని ప్లే చేశారు.

ఒలింపిక్స్ ను అడ్డుకునే కుట్ర

ఒలింపిక్స్ ను అడ్డుకునే కుట్రలు జరగడం ఆందోళనకర విషయం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు విశ్వక్రీడల్లో గందరగోళ వాతావరణం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఓ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. ప్రారంభ వేడుకల రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌పై దాడులు చేశారు. ముఖ్యంగా పారిస్‌కు వెళ్లే మార్గాలను లక్ష్యంగా చేసుకున్నారు. పలుచోట్ల రైల్వే పట్టాలను ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల రైల్వే కేబుళ్లను కత్తిరించడం, నిప్పు పెట్టడం చేశారు. ఫలితంగా ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాలుష్య కోరల్లో సెయిన్ నది

సెయిన్ నది గురించి అంతటా చర్చ జరిగింది. ఆ నదిలో ప్రారంభ వేడుకలు నిర్వహించడం ఒక కారణమైతే.. మరో కారణం కాలుష్యం. సెయిన్ నది కాలుష్య కోరల్లో చిక్కుక్కుపోయింది. 100 సంవత్సరాలుకుపైగా ఆ నదిలో ఈతకొట్టడం నిషేధించారు. అయితే, ఒలింపిక్స్‌లో భాగంగా మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లాన్ ఈవెంట్లను అదే నదిలో నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం దాదాపు రూ. 12 వేల కోట్ల వ్యయంతో నదిని శుభ్రం చేశారు. అయితే, నీటి నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇటీవల ఫ్రెంచ్ స్పోర్ట్స్ మినిష్టర్ సెయిన్ నదిలో ఈత కొట్టి అథ్లెట్లకు సురక్షితమే అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వర్షాలు పడటంతో మురుగు నీళ్లు నదిలో చేరాయి. నీటి నాణ్యత తగ్గడంతోపాటు హానికరమైన బ్యాక్టీరియా గుర్తించారు. తాజాగా ట్రయాథ్లాన్ ట్రైనింగ్‌ సెషన్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లాన్ ఈవెంట్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సెయిన్ నదిలో ఈవెంట్లను నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మహిళపై గ్యాంగ్‌రేప్

ఒలింపిక్స్కు ముందు ఆస్ట్రేలియన్ మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపింది. సెంట్రల్ పారిస్‌లో 25 ఏళ్ల మహిళపై ఐదుగురు సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. చిరిగిన దుస్తులతో సదరు మహిళా ఓ రెస్టారెంట్‌కు వెళ్లగా ఆ రెస్టారెంట్ యజమానులు ఆమెకు సాయం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటన మహిళా అథ్లెట్ల భద్రతపై అనుమానాలను పెంచింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియన్ ఒలింపిక్స్ టీమ్ చీఫ్ అన్నా మీరస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒలింపిక్ విలేజ్ నుంచి బయటకు వెళ్లొద్దని తమ అథ్లెట్లకు సూచించినట్టు తెలిపింది.


Similar News