పరువు కాపాడుకున్న సౌతాఫ్రికా.. మూడో వన్డేలో గెలుపు
అఫ్గానిస్తాన్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి వన్డే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా ఆఖరి మ్యాచ్‌లో నెగ్గి పరువు కాపాడుకుంది.
దిశ, స్పోర్ట్స్ : అఫ్గానిస్తాన్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి వన్డే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా ఆఖరి మ్యాచ్‌లో నెగ్గి పరువు కాపాడుకుంది. షార్జా వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 34 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది. గుర్బాజ్(89) మరోసారి రాణించగా.. గజన్‌ఫర్(31 నాటౌట్) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం గమనార్హం. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, పీటర్, ఫెహ్లుక్వాయో రెండేసి వికెట్లతో సమిష్టిగా రాణించారు. అనంతరం 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్‌క్రమ్(69 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావించిన అఫ్గాన్‌కు నిరాశ తప్పలేదు. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.