చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో రెండు స్వర్ణాలు

హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది.

Update: 2024-09-22 16:51 GMT

దిశ, స్పోర్ట్స్ : హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారిగా స్వర్ణ పతకాలు దక్కించుకున్నాయి. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్లు ఆదివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్‌లోనూ సత్తాచాటాయి. పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో స్లోవేనియాను చిత్తు చేసింది. ఫెడోసీవ్ వ్లాదిమిర్‌పై గుకేశ్, డెమ్చెంకో అంటోన్‌పై గుకేశ్, సుబెల్జ్ జాన్‌పై అర్జున్ ఇరిగేశి తమ గేమ్‌ల్లో గెలుపొందారు. ఇక, సెబెనిక్ మటెజ్‌తో విదిత్ సంతోశ్ గుజరాతి డ్రా చేసుకున్నాడు. స్లోవేనియాపై విజయంతో భారత పురుషుల జట్టు 21 పాయింట్లతో అగ్రస్థానంతో విజేతగా నిలిచింది. టోర్నీలో భారత పురుషుల జట్టు ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకపోవడం విశేషం. 11 రౌండ్లలో 10 నెగ్గగా.. 9వ రౌండ్‌లో డ్రా చేసుకుంది. అమెరికా(17), ఉజ్బెకిస్తాన్(17) వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నాయి. టోర్నీ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన‌గా నిలిచింది. 2022లో కాంస్యం సాధించింది. 2020లో స్వర్ణం, 2021లో కాంస్యం నెగ్గినా కరోనా కారణంగా ఆ రెండు ఎడిషన్లు వర్చువల్‌గా జరగడంతో లెక్కలోకి తీసుకోలేదు.

అమ్మాయిలూ అదరహో

అమ్మాయిలు కూడా అదరగొట్టారు. పసిడి పట్టేశారు. విజేతగా నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మహిళల జట్టు 3.5-1.5 తేడాతో అజర్‌బైజాన్‌‌ను ఓడించింది. ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్ తమ గేమ్‌ల్లో నెగ్గడంతో భారత్‌కు తిరుగులేకుండా పోయింది. వైశాలి తన గేమ్‌లో డ్రా చేసుకుంది. చెస్ ఒలింపియాడ్‌లో మహిళల జట్టు‌కు ఇదే తొలి బంగారు పతకం. మొత్తంగా రెండో మెడల్. 2022లో కాంస్యం సాధించింది. కజకస్తాన్(18), అమెరికా(17) రజతం, కాంస్యం దక్కించుకున్నాయి.

మెరిసిన అర్జున్

తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి రౌండ్ నుంచి అద్భుతంగా రాణించాడు. టోర్నీలో అతను ఒక్క గేమ్ కూడా ఓడకపోవడం విశేషం. 9 గేముల్లో పైచేయి సాధించగా.. మరో రెండు గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. దీంతో 3వ బోర్డులో అర్జున్ బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. ఫైడ్ ర్యాంకింగ్స్‌లో అర్జున్ వరల్డ్ నం.4లో కొనసాగుతున్నాడు. భారత్ తరపున అతనిదే టాప్ ర్యాంక్.

Tags:    

Similar News