భారత ‘సి’ జట్టుపై అద్భుత విజయం.. భారత ‘ఏ’ జట్టుదే దులీప్ ట్రోఫీ

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ టైటిల్‌ను భారత ‘ఏ’ జట్టు కైవసం చేసుకుంది.

Update: 2024-09-22 12:33 GMT

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ టైటిల్‌ను భారత ‘ఏ’ జట్టు కైవసం చేసుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మూడో రౌండ్ మ్యాచ్‌లో భారత ‘సి’ జట్టును ఓడించి చాంపియన్‌గా నిలిచింది. అనంతపురం వేదికగా ఆఖరి రోజైన ఆదివారం ముగిసిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ‘ఏ’ జట్టు 132 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట ఓవర్‌నైట్ స్కోరు 270/6 స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ‘ఏ’ జట్టు 286/8 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 63 పరుగులు కలుపుకుని ‘ఏ’ జట్టు.. ‘సి’ జట్టు ముందు 350 పరుగుల టార్గెట్ పెట్టింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన ‘సి’ జట్టు 217 రన్స్‌కే ఆలౌటైంది. ‘ఏ’ జట్టు బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ(3/50), తనుష్(3/47), ఆకిబ్ ఖాన్(2/26) సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని కూల్చేశారు. సాయి సుదర్శన్(111) సెంచరీతో కీలక పోరాటం చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ‘సి’ జట్టుకు ఓటమి తప్పలేదు.

భారత ‘డి’ జట్టుకు తొలి విజయం

అర్ష్‌దీప్ సింగ్ (6/40), ఆదిత్య ఠాకరే(4/59) బంతితో చెలరేగడంతో భారత ‘డి’ జట్టు టోర్నీలో ఆఖరి మ్యాచ్‌లో గెలుపు రుచిచూసింది. తొలి రెండు రౌండ్లలో ఓడిన ‘డి’ జట్టు.. మూడో రౌండ్‌లో భారత ‘బి’ జట్టుపై 257 పరుగుల తేడా నెగ్గింది. మొదట తెలుగు కుర్రాడు రికీ భుయ్(119 నాటౌట్) అజేయ సెంచరీతో రెచ్చిపోవడంతో ‘డి’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. ఆ తర్వాత 373 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ‘బి’ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య పేస్ ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(40 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 9 వికెట్లతో సత్తాచాట్టగా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో(56, 119 నాటౌట్‌) అదరగొట్టిన రికీ భుయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

Tags:    

Similar News