మేఘాలయను బెంబేలెత్తించిన హైదరాబాద్ బౌలర్లు
బౌలర్లు సత్తాచాటడంతో మేఘాలయతో ప్లేట్ గ్రూపు మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది.
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ బౌలర్లు మరోసారి చెలరేగారు. బౌలర్లు సత్తాచాటడంతో మేఘాలయతో ప్లేట్ గ్రూపు మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మొదట టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మేఘాలయను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్ కిషన్ లింగ్డో(51) మినహా మిగతా వారు తేలిపోయారు. ముగ్గురు డకౌటవ్వగా.. నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారంటే హైదరాబాద్ బౌలర్లు ఏ విధంగా రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. దీంతో మేఘాలయ 33.1 ఓవర్లలో కష్టంగా 111 పరుగులు చేసి ఆలౌటైంది. సాయిరామ్ 4 వికెట్లతో ప్రత్యర్థి పతనంలో కీలక పాత్ర పోషించగా.. మిలింద్, రవితేజ, త్యాగరాజన్ రెండేసి వికెట్లతో రాణించారు. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ సింగ్(22)తోపాటు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(11), అభిరత్ రెడ్డి(1) త్వరగానే వికెట్ పారేసుకున్నారు. అయితే, రోహిత్ రాయుడు(54 బ్యాటింగ్), చందన్ సహాని(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. చందన్ సహాని అవుటైన తర్వాత ప్రగ్నయ్ రెడ్డి(32 బ్యాటింగ్)తో కలిసి రోహిత్ రాయుడు తొలి రోజు ఆట ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ భారీ స్కోరు చేస్తే మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించే అవకాశం ఉంది.