అతను కచ్చితంగా జట్టులో ఉండాల్సిన ఆటగాడు: హర్భజన్ సింగ్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2023-09-19 17:25 GMT

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో గాయం కారణంగా అక్షర్ పటేల్ తొలి రెండు వన్డేలకు దూరమవ్వగా.. అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సెలెక్టర్ అవకాశమిచ్చారు. తన యూట్యూబ్ చానెల్‌లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. చాహల్ జట్టులో ఉండాల్సిన ప్లేయర్ అని చెప్పాడు. ‘అతను జట్టులో ఉండాల్సిన వ్యక్తి. అతనికి అవకాశం దక్కలేదు. ఇది నా అవగాహనకు మించినది. అతను ఎవరితోనైనా గొడవపడ్డాడా? లేదంటే ఎవరితోనైనా ఏమైనా చెప్పాడో నాకు తెలియదు. అయితే, నైపుణ్యం గురించి మాట్లాడుకుంటే.. చాలా మందికి విశ్రాంతినిచ్చారు కాబట్టి జట్టులో అతని పేరు ఉండాల్సింది.’ అని తెలిపారు. కాగా, ఆసియా కప్‌తోపాటు వన్డే ప్రపంచకప్‌లోనూ చాహల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ రాణిస్తుండటంతో చాహల్‌‌కు జట్టులో చోటు కష్టమైపోయింది.


Similar News