సీఎస్కేకు ధోనీ ఫస్ట్ చాయిస్ కాదు.. అతన్ని తీసుకోవాలనుకున్నారు.. సీఎస్కే మాజీ ప్లేయర్ ఆసక్తికర కామెంట్స్

చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-09-13 18:36 GMT

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనీ సీఎస్కేను ఐదు సార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు. ధోనీ లేకుండా సీఎస్కేను ఊహించుకోవడం కూడా ఫ్యాన్స్‌కు కష్టమే. అలాంటిది 2008 ప్రారంభ ఎడిషన్‌ వేలంలో సీఎస్కే ఫ్రాంచైజీకి ధోనీ ఫస్ట్ చాయిస్ కాదట. తాజాగా టీమిండియా, సీఎస్కే మాజీ క్రికెటర్ ఎస్ బధ్రీనాథ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

సీఎస్కే మేనేజ్‌మెంట్ ధోనీకి బదులు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వైపు మొగ్గుచూపిందని తెలిపాడు. ‘సీఎస్కే జట్టు నిర్మాణంలో భారత మాజీ ఆటగాడు వీబీ చంద్రశేఖర్‌ కీలక పాత్ర పోషించాడు. నన్ను సీఎస్కేలోకి తీసుకుంది అతనే. నేను అతనికి కృతజ్ఞుడిని. ధోనీని తీసుకోవడానికి కూడా కారణం అతనే. అంతకుముందు సీఎస్కే మేనేజ్‌మెంట్ సెహ్వాగ్‌‌ను తీసుకోవాలనుకుంది. కానీ, అప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్) నుంచి సెహ్వాగ్ ఆఫర్ అందుకున్నాడు.’ అని చెప్పాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ధోనీ చెన్నయ్ కెప్టెన్‌గా తప్పుకుని యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడా?లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది.

Tags:    

Similar News