IND VS AUS : సుందర్ ఔట్ వివాదాస్పదం.. జైశ్వాల్ విషయంలో అలా.. సుందర్ విషయంలో ఇలా.. ఫైర్ అయిన బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో థర్డ్ అంపైర్ నిర్ణయం మరోసారి వివాదాస్పదమైంది.
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో థర్డ్ అంపైర్ నిర్ణయాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయని క్రికెట్ అభిమానులు మండిపోతున్నారు. తొలి టెస్టు నుంచి వివిధ సందర్భాల్లో భారత్‌కు థర్డ్ అంపైర్ నిర్ణయాలు వ్యతిరేకంగానే వచ్చాయి. తాజాగా ఐదో టెస్టులోనూ అదే జరిగింది. వాషింగ్టన్ సుందర్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. కమిన్స్ వేసిన 66వ ఓవర్‌లో సుందర్ వివాదాస్పద రీతిలో క్యాచ్ అవుటయ్యారు. కమిన్స్ వేసిన 6వ బంతిని సుందర్ ఆడే ప్రయత్నం చేయగా.. బాల్ మిస్ అయ్యి కీపర్ అలెక్స్ కేరీ చేతిలో పడింది. క్యాచ్ అవుట్ అంటూ ఆసిస్ ఆటగాళ్లు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
దీంతో ఆసిస్ రివ్యూ తీసుకోగా.. థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. స్నీకో మీటర్‌లో స్పైక్ ఆధారంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, సమీక్షలో ఒక కోణంలో తాకినట్టుగా.. మరో కోణంలో తాకనట్టుగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ, థర్డ్ అంపైర్ ఆ రూల్‌ను పట్టించుకోలేదు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..గత మ్యాచ్‌లో జైశ్వాల్ విషయంలో థర్డ్ అంపైర్ స్నీకో మీటర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. స్పైక్ రాకపోయినా బంతి గమనం మారిందని అవుట్ ఇవ్వడం గమనార్హం.
దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సుందర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బుమ్రా కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘గత మ్యాచ్‌లో స్నీకో ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం స్పైక్ వచ్చిందని ఔటిచ్చాడు.'అని బుమ్రా అనడం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.