ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్‌ను వదిలేసిన కార్బిన్ బాష్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బాష్ వివరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

- వేటు వేయాలని భావిస్తున్న పీసీబీ
- ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన బాష్
- తన కెరీర్ గ్రోత్ కోసమే అంటున్న దక్షిణాఫ్రికా క్రికెటర్
దిశ, స్పోర్ట్స్: సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ కార్బిన్ బాష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఐపీఎల్‌లో ఆడటం కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడిపై నిషేధం విధించాలని పీఎస్ఎల్ భావిస్తోంది. ముంబై ఇండియన్ ఆటగాడు లిజాద్ విలియమ్స్ గాయపడటంతో అతని స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన కార్బిన్ బాష్‌ను ఎంపిక చేసింది. అయితే ఇప్పటికే పీఎస్ఎల్‌లోని పెషావర్ జల్మీ జట్టులో సభ్యుడైన బాష్.. ముంబై ఇండియన్స్ నుంచి పిలుపు రావడంతో పీఎస్ఎల్ నుంచి తప్పుకున్నాడు. తనకు పీఎస్ఎల్ అంటే ఎలాంటి అగౌరవం లేదని.. కేవలం తన కెరీర్ గ్రోత్ కోసమే ముంబై జట్టు ఆఫర్‌ను స్వీకరించినట్లు తెలిపారు. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రపంచ క్రికెట్‌లో ఉన్న స్థాయి, ప్రభావం కారణంగానే ఆ జట్టుతో చేరినని.. అది తన కెరీర్ గ్రోత్‌కు ఉపయోగపడుతుందని బాష్ చెప్పాడు.
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బాష్ వివరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అతనిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు కూడా పీసీబీ వర్గాలు చెప్పాయి. 2016లో పీఎస్ఎల్ ప్రారంభమవగా.. ఇప్పటి వరకు ఐపీఎల్‌తో క్లాష్ కాలేదు. ఇటీవల పాకిస్తాన్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు, చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కారణంగా ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సిన పీఎస్ఎల్‌ను ఏప్రిల్-మే నెలలకు వాయిదా వేశారు. దీంతో బాష్ పీఎస్ఎల్ బదులుగా ఐపీఎల్‌లో ఆడటానికి నిర్ణయించుకున్నాడు. ఎస్ఏ20లో ఎంఐ కేప్‌టౌన్ జట్టులో బాష్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఎస్ఏ టైటిల్‌ను ఎంఐ కేప్‌టౌన్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.ఈ సీజన్‌లో 11 వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటుతో కూడా రాణించాడు. ఎస్ఏ20లో వచ్చిన గుర్తింపుతో 2024లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించాడు.