Cricket South Africa: ఆటగాళ్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. సౌతాఫ్రికా కీలక నిర్ణయం

Update: 2023-08-14 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫిట్‌నెస్‌ టెస్టుల విషయంలో తమ క్రికెటర్లకు ఊరటనిస్తూ క్రికెట్‌ సౌతాఫ్రికా(CSA) కీలక నిర్ణయం తీసుకుంది. తమ క్రికెటర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై రెండు కిలోమీటర్ల పరుగును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయలేకపోయినా.. సెలక్షన్‌కు అందుబాటులో ఉండొచ్చని పేర్కొంది. ఫిట్‌నెస్‌లో విఫలమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలన్న నిబంధన కూడా తప్పనిసరి కాదని.. జాతీయ జట్ల కోచ్‌లదే అంతిమ నిర్ణయం అని స్పష్టం చేసింది. ఫిట్‌నెస్‌ విషయంలో కనీస స్థాయి ప్రమాణాలు అందుకోకపోనట్లయితే అధికారిక మ్యాచ్‌లలో మైదానంలో దిగే అవకాశం మాత్రం ఉండదని చెప్పింది. పరిమిత ఓవర్లు, రెడ్‌ బాల్‌ క్రికెట్‌లోనూ ఈ కొత్త మార్గదర్శకాలను పాటిస్తామని బోర్డు తెలిపింది. పురుష, మహిళా క్రికెటర్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని క్రికెట్‌ సౌతాఫ్రికా స్పష్టం చేసింది.

కాగా ఇటీవల ప్రొటిస్‌ మహిళా​ క్రికెటర్లు డేన్‌ వాన్‌ నికెర్క్‌, లిజెల్లీ లీ.. సౌతాఫ్రికా మెన్స్‌ స్టార్‌ పేసర్‌ సిసంద మగల నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగు పూర్తి చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో 18 సెకండ్ల తేడాతో టెస్టులో విఫలమై టీ20 ప్రపంచకప్‌కు దూరమైన నికెర్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. మగల మాత్రం ఫిట్‌నెస్‌ టెస్టులో పాసై నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Similar News