134పరుగుల ఆధిక్యతలో న్యూజిలాండ్

బెంగుళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతూ మ్యాచ్ పై పట్టు బిగిస్తోంది.

Update: 2024-10-17 12:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : బెంగుళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతూ మ్యాచ్ పై పట్టు బిగిస్తోంది. రెండోరోజు ప్రారంభమైన మ్యాచ్ లో టీమిండియాను తొలి ఇన్నింగ్స్ లో కేవలం 31.2ఓవర్లలో 46పరుగుల స్వల్ప స్కోరుకే కివీస్ పేసర్లు ఆలౌట్ చేసి గట్టి షాక్ ఇచ్చారు. న్యూజిలాండ్ అనంతరం తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 50ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 180పరుగులతో రెండో రోజు ఆటను ముగించింది. టీమిండియాపై 134పరుగుల కీలక ఆధిక్యత సాధించింది. క్రీజ్ లో రచిన్ రవీంద్ర 22, మిచెల్ 14పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. కివీస్ భారీ స్కోరుకు బాసటగా నిలిచిన ఓపెనర్ డెవిడ్ కాన్వే( 91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అతడిని రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. కివీస్ బ్యాటర్ యంగ్ 33, ఓపెనర్ టామ్ లాథమ్ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కుల్ధీప్ యాదవ్, జడేజా, ఆశ్విన్ లు తలో వికెట్ సాధించారు.

కివీస్ పేస్ త్రయం మ్యాట్ హెన్రీ, విలియం ఓ రూర్కీ, సౌథీలు చెలరేగిన పిచ్ పై టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బూమ్రా, సిరాజ్ లు తేలిపోయారు. వారిద్దరు 17ఓవర్లు వేసినా వికెట్ తీయలేకపోయారు. అంతకుముందు తొలి రోజు ఆట అంతా వర్షంతో టాస్ వేయకుండానే వృథా అయ్యింది. రెండోరోజు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద తప్పు చేసింది. ఈ మ్యాచ్ లో 5గురు భారత బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. ఆట ప్రారంభంలోనే కెప్టన్, ఓపెనర్ రోహిత్ శర్మ(2) తొలి వికెట్ గా పెవిలియన్ చేరగా, కోహ్లీ, సర్ఫరాజ్ లు డకౌట్ గా వెనుతిరిగారు. అనంతరం లోకల్ హీరో కెఎల్. రాహుల్, జడేజాలు కూడా డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 13పరుగులకు అవుటయ్యాడు.

లంచ్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి34 పరుగులు మాత్రమే చేసింది. లంచ్ తర్వాత టీమిండియా భారీ ఆశలు పెట్టుకున్న అశ్విన్ కూడా డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే పంత్ 20, కుల్ధీప్ యాదవ్ 2, బూమ్రా 1, సిరాజ్ 4పరుగులకే పెవిలియన్ చేరారు. కివీస్ పేసర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీయగా, విలియం ఓ రూర్కీ 4, సౌథీ 1 వికెట్లు సాధించి టీమిండియాను స్వల్ప స్కోరు 46పరుగులకే కుప్పకూల్చారు. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియాకు ఇదే అత్యల్ప స్కోరు. గతంలో 1987లో వెస్టిండీస్ పై 75 పరుగులు చేసింది.  


Similar News