చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌కు ఐసీసీ ఆమోదం..పాక్‌కు టీమిండియా వెళ్తుందా?

వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ కానుంది.

Update: 2024-06-21 19:00 GMT

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ కానుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పంపించిన ప్రతిపాదిత షెడ్యూల్‌ను తాజాగా ఐసీసీ ఆమోదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ జరిగే అవకాశం ఉంది. పీసీబీ షెడ్యూల్‌లో ఐసీసీ ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది. ఈ నెలలో మిగతా బోర్డులకు ఐసీసీ షెడ్యూల్‌లను పంపించి అభ్యంతరాలను కోరనుంది.

ఈ టోర్నీకి పీసీబీ కరాచీ, రావల్పిండి, లాహోర్ వేదికలను ఎంపిక చేసింది. భారత్ మ్యాచ్‌లన్నీ లాహోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాక్‌లో పర్యటించడంపై సందిగ్ధం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జట్టు పాక్‌లో పర్యటించడం లేదు. ఇరు జట్లు కేవలం ఐసీసీ, ఆసియా ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. గతేడాది ఆసియా కప్ తరహాలో చాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్‌‌లో నిర్వహించి, భారత్ మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.


Similar News