ధనశ్రీకి చాహల్ రూ.4.75 కోట్ల భరణం
విడాకులు మంజూరు చేసిన తర్వాత మాత్రమే శాశ్వత భరణం రెండో విడత చెల్లించబడుతుందనే నిబంధన ఉంది. వారిద్దరూ ఆ నిబంధనకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపారు.

- ఫిబ్రవరి 5న విడాకులకు పిటిషన్
- 6 నెలల కూలింగ్ ఆఫ్ పిరియడ్ ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్
- అడిగిన మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్న చాహల్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల కేసున మార్చి 20 నాటికి కొలిక్కి తీసుకొని రావాలని బాంద్ర మెజిస్ట్రేట్ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న యజువేంద్ర చాహల్ మార్చి 22 నుంచి లీగ్‌లో బిజీ అవుతున్న నేపథ్యంలో గురువారం నాటికి కేసు పరిష్కరించాలని జస్టిస్ మాధవ్ జాందార్ ధర్మసనం ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. చాహల్, ధనశ్రీ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఫిబ్రవరి 20న కూలింగ్ ఆఫ్ పిరియడ్ 6 నెలల సమయాన్ని తొలగించడానికి ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. అయితే చాహల్, ధనశ్రీ 2022 జూన్ నుంచి విడివిడిగా జీవిస్తున్నారు. ధనశ్రీకి చాహల్ రూ.4.75 కోట్లు చెల్లించడానికి సుముఖంగా ఉన్నట్లు కోర్టు పేర్కొంది. అంతే కాకుండా ఇప్పటికే రూ.2.37 కోట్లు చెల్లింపులు చేసినట్లు కూడా తెలిసింది.
కాగా, ముంబైలోని ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ చాహల్, ధనశ్రీ సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బీ ప్రకారం.. విడాకుల డిక్రీని మంజూరు చేయడానికి ముందు ఆరు నెలల కూలింగ్ ఆఫ్ వ్యవధి తప్పని సరి. ఈ సమయంలో ఇరువురు తమ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకొని, తిరిగి కలిసిపోతారనే ఉద్దేశంతో ఈ ఆరు నెలల సమయాన్ని ఇస్తారు. అయిత చాహల్, ధనశ్రీ ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు వేర్వేరుగా జీవిస్తున్నారు. పైగా మధ్యవర్తిత్వ సమయంలో అంగీకరించిన భరణం ఇవ్వడానికి కూడా చాహల్ సిద్ధంగా ఉన్నాడు. దీంతో ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పిరియడ్‌ను రద్దు చేస్తూ జస్టిస్ జందార్ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు కలసి పిటిషన్ దాఖలు చేసినందున.. ప్రతివాదులు లేని అరుదైన కేసుగా పేర్కొన్నారు. విడాకులు మంజూరు చేసిన తర్వాత మాత్రమే శాశ్వత భరణం రెండో విడత చెల్లించబడుతుందనే నిబంధన ఉంది. వారిద్దరూ ఆ నిబంధనకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపారు.