ఐపీఎల్‌లో తెర వెనుక బాగోతాలు.. వేల కోట్లు ఆర్జిస్తున్న మాఫియా
కంచే చేను మేయడం అంటే తెలుసుగా.. ఎవరైతే రక్షణగా ఉండాలో.. వాళ్లే దోచేయడం. అలాంటిదే ఐపీఎల్‌లో జరిగింది. క్రికెట్ బెట్టింగ్ యాప్‌లకు ఏకంగా బీసీసీఐ మద్దతుగా ఉండటం.. ఫ్రాంచైజీ యాజమాన్యాలే బెట్టింగ్‌లకు పాల్పడటం ఐపీఎల్‌లో పెద్ద విషాదం. క్రీడల్లో బెట్టింగ్ సర్వసాధారణం.

దిశ, స్పోర్ట్స్: కంచే చేను మేయడం అంటే తెలుసుగా.. ఎవరైతే రక్షణగా ఉండాలో.. వాళ్లే దోచేయడం. అలాంటిదే ఐపీఎల్‌లో జరిగింది. క్రికెట్ బెట్టింగ్ యాప్‌లకు ఏకంగా బీసీసీఐ మద్దతుగా ఉండటం.. ఫ్రాంచైజీ యాజమాన్యాలే బెట్టింగ్‌లకు పాల్పడటం ఐపీఎల్‌లో పెద్ద విషాదం. క్రీడల్లో బెట్టింగ్ సర్వసాధారణం. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. మన దేశంలో కూడా అనధికారికంగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక వంటి దేశాల్లో బెట్టింగ్‌ను ఆయా ప్రభుత్వాలు చట్టబద్దం చేశాయి. కానీ అసలు బెట్టింగ్‌పై నిషేధం ఉన్న భారత్‌లో మాత్రం.. ఆ దేశాల కంటే ఎక్కువగా బెట్టింగ్‌లు పెడుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఒక వైపు తెలంగాణ రాష్ట్ర పోలీసులు బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించారు. వాటిని ప్రచారం చేస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ అనుమతి ఉందంటూ 'ఫాంటసీ లీగ్' పేరుతో అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. కేవలం రూ.40, రూ.50, రూ.60 వంటి చిన్న మొత్తాలే అంటూ ఆకర్షించి.. ఆ తర్వాత యూజర్లను బెట్టింగ్‌కు పూర్తిగా అలవాటు చేస్తాయి. విషయం ఏంటంటే.. ఇలా బెట్టింగ్‌లు నడిపే 'డ్రీమ్ 11' అనే సంస్థ 2020లో ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. ఇప్పుడు మై 11 సర్కిల్ అనే సంస్థ ఐపీఎల్ ఫాంటసీ లీగ్ భాగస్వామిగా ఉంది. 2028 వరకు అధికార ఫాంటసీ స్పోర్ట్ పార్ట్‌నర్‌గా ఉండేదుకు రూ.625 కోట్లు చెల్లించింది.
ఏంటీ ఫాంటసీ లీగ్స్?
మన దేశంలో డ్రీమ్ 11, మై11సర్కిల్, ఎంపీఎల్, ఫ్యాన్‌ఫైట్, క్రిక్‌ప్లే, మైటీమ్ వంటి ఫాంటసీ లీగ్ యాప్స్ అనేకం ఇంటెర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా చిన్నాచితకా యాప్స్ మరో 150 వరకు ఉంటాయి. వీటి మార్కెట్ వాల్యూ రూ.లక్ష కోట్లు అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ రోజు లైవ్ మ్యాచ్‌తో పాటే సరదాగా ఫాంటసీ లీగ్ ఆడాలంటూ ఇవి యాడ్స్ కూడా ఇస్తుంటాయి. ఈ ఫాంటసీ లీగ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లతో ఒక టీమ్‌ను తయారు చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్న ఆటగాళ్లు మ్యాచ్‌లో చేసే ప్రదర్శన ఆధారంగా మనకు పాయింట్లు లభిస్తాయి. ఈ ఫాంటసీ లీగ్స్‌ను ఉచితంగానే ఆడవచ్చని ముందు యాప్స్ ఆకర్షిస్తాయి. అదే సమయంలో కనీసం రూ.35 నుంచి రూ.5 వేల వరకు పెట్టి ఆడే కేటగిరీలు కూడా ఉన్నాయని చూపిస్తుంటాయి. రూ.కోట్లలో ప్రైజ్ మనీ లభిస్తుందని యూజర్లను ఆకర్షిస్తుంటాయి.
అయితే కనీసం రూ.50 పెట్టి ఆడేవాళ్లు ఓడిపోయినా పెద్దగా పట్టించుకోరు. కానీ అవే ఈ ఫాంటసీ లీగ్ యాప్స్‌కు కోట్లాది రూపాయల లాభాలు తెచ్చిపెడుతున్నాయి. సాధారణంగా బెట్టింగ్స్‌లో పంటర్లు, మిడిల్ మ్యాన్, బుకీలంటూ పెద్ద వ్యవస్థే ఉంటుంది. కానీ ఫాంటసీ లీగ్స్‌లో పేరుతో అనధికార బెట్టింగ్ నిర్వహించే ఈ సంస్థలు నేరుగా యూజర్లతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. 2020లో టాప్ ఐదు ఫాంటసీ లీగ్ సంస్థలు ఏకంగా రూ.450 కోట్ల జీఎస్టీని చెల్లించాయంటే వీటికి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే 2023లో ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో చాలా యాప్స్ ఆన్‌లైన్ గేమింగ్ నుంచి తప్పుకున్నాయి.
ఏపీ, తెలంగాణలో నిషేధం..
కేంద్ర ప్రభుత్వం డ్రీమ్11, మై11సర్కిల్ వంటి యాప్స్‌కు అనుమతులు ఇచ్చింది. అనుమతులు లేని యాప్స్ కూడా ఏపీకే లింక్స్ రూపంలో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే కేంద్రం అనుమతులు ఇచ్చిన ఫాంటసీ లీగ్ యాప్స్ ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో డౌన్‌లోడ్ అయినా.. వాటిలో డబ్బు పెట్టి ఆడటానికి అనుమతి లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో డబ్బులు పెట్టి డ్రీమ్ 11 లో ఆడటానికి వీలుండదు. అలాగే సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ యాప్స్‌పై అనేక ఆంక్షలు ఉన్నాయి. మై 11 సర్కిల్ వంటి ఫాంటసీ లీగ్ యాప్‌కు గతంలో గంగూలీ, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి వారు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ప్రస్తుతం యువ క్రికెటర్లు రింకూ సింగ్, యశస్వీ జైస్వాల్ బ్రాండ్ పార్ట్‌నర్లుగా ఉన్నారు. ఇలా బీసీసీఐ స్వయంగా ఫాంటసీ లీగ్ యాప్స్‌తో జతకట్టి.. అభిమానులను బెట్టింగ్‌ల వైపు ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
బెట్టింగ్ భూతం..
ఒక వైపు ఫాంటసీ లీగ్స్ పేరుతో కొన్ని యాప్స్ అధికారికంగానే అభిమానులతో బెట్టింగ్స్ పెట్టిస్తుంటే.. ఇక అనధికారికంగా జరిగే బెట్టింగ్ మాత్రం ఎప్పటిలాగే రూ.వేల కోట్లను వెనకేసుకుంటోంది. క్రికెట్ వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ సమయంలో కంటే ఐపీఎల్ జరిగే సమయంలోనే ఈ బెట్టింగ్ మాఫియా వేలాది కోట్ల రూపాయలను కొల్లగొడుతోంది. ఇండియాలో బెట్టింగ్ మార్కెట్ విలువ ఏడాదికి రూ.11 లక్షల కోట్లు దాటిపోయింది. ఇండియాలో ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ మార్కెట్ 2024 లో 100 బిలియన్ డాలర్ల మేర కొల్లగొట్టింది. ప్రతి ఏటా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ మార్కెట్ వాల్యూ 30 శాతం మేర పెరుగుదల ఉందని సెంటర్ ఫర్ నాలెడ్జ్ సావెరినిటీ (సీకేఎస్) అనే సంస్థ తెలియజేసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా ఈ బెట్టింగ్ మాఫియాకు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుండటంతో ఏకంగా ఫిక్సింగ్‌కు కూడా తెరలేపాయి. బాల్ టు బాల్.. ఓవర్ టు ఓవర్.. బెట్టింగ్స్ జరుగుతున్నాయి. టాస్ నుంచి ఈ బెట్టింగ్స్ మొదలవుతుంటాయి. ఈ ఓవర్‌లో ఏం జరుగుతుంతో చూసే ప్రేక్షకులకు తెలియదు. కానీ ఫిక్సర్లకు మాత్రం ముందే తెలిసిపోతుంటాయి. అందుకే ప్రతీ బాల్‌పై ఎంత పెట్టాలో వాళ్లే ఫిక్స్ చేస్తుంటారు. బెట్టింగ్ మాఫియా, ఫిక్సర్ల చేతుల్లోకి గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల నిర్వాహకులు కూడా వెళ్లిపోయారు.
ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా..
ఐపీఎల్‌లో కూడా ఫిక్సింగ్ వ్యవహారాలు బయటపడ్డాయి. ఐపీఎల్‌లో గతంలో చాంపియన్లుగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల యాజమాన్యాలు ఫిక్సింగ్‌లో భాగస్వామ్యమయ్యాయనే కారణంతో రెండేళ్ల పాటు నిషేధాన్ని కూడా ఎదుర్కున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీల నిషేధానికి కారణం స్పాట్ ఫిక్సింగే. ఇల్లీగల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లో ఆటగాళ్లు, యాజమాన్యంలోని కీలక వ్యక్తులు భాగస్వామ్యం అయినట్లు గుర్తించడం వల్లే నిషేధం విధించినట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అప్పట్లో ఫిక్సింగ్‌లో భాగస్వామ్యం అయిన ప్రముఖ ఆటగాడు శ్రీశాంత్‌పై కూడా జీవితకాలం బ్యాన్ విధించింది. ఆ తర్వాత కాలంలో దీన్ని ఏడేళ్లకు కుదించారు. ఈ అక్రమాలు బయటకు వచ్చిన తర్వాత బీసీసీఐ ప్రత్యేకంగా గుజరాత్ మాజీ డీజీపీ అజిత్ సింగ్ నేతృత్వంలో యాంటీ కరప్షన్ యూనిట్ ఏర్పాటు చేసింది.
ఫిక్సింగ్ చేసేదిలా..
ఒక మ్యాచ్ ఫిక్స్ చేయడం అంత ఈజీ కాదు. దీని వెనుక ఫ్రాంచైజీకి చెందిన వ్యక్తులు, క్రికెటర్ల సహకారం తప్పనిసరి. బౌలర్, బ్యాటర్, బుకీలకు మధ్య కొన్ని సంకేతాల ద్వారా సమాచార మార్పిడి జరుగుతుందని గతంలో పట్టుబడిన ఆటగాళ్లు చెప్పారు. గ్రౌండ్‌లో ఉండే ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఫిక్సింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. బౌలర్ కర్చీఫ్ తీసి తుడుచుకోవడం, బ్యాటర్ పిచ్ మధ్యకు వచ్చి బ్యాటుతో కొట్టడం, స్కోర్ బోర్డుపై బౌలర్ లేదా బ్యాటర్ పక్కన చుక్కలు పెట్టడం.. ఇలాంటి సంకేతాల ద్వారా తర్వాత ఏం చేయాలో చెప్తుంటారు. దానికి అనుగుణంగానే బంతి వైడ్ లేదా నోబాల్ వేయడం.. బ్యాటర్ సిక్స్ లేదా ఫోర్ కొట్టడం. లేదంటే అవుట్ కావడం జరుగుతుంటుంది.
ఇలాంటి సమయంలోనే బెట్టింగ్ మాఫియా ఇది సిక్సా? ఔటా అనే బెట్టింగ్స్ నడుపుతుంటుంది. బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్ బెట్టింగ్స్ నడిపి లక్షల కోట్ల రూపాయలు తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరుగుతుందా? లేదా అనేది తెలియకపోయినా.. అనధికార బెట్టింగ్ మాత్రం ఇప్పటికే అలర్ట్ అయ్యింది. ఈ రెండు నెలల సీజన్‌లో ఈ బెట్టింగ్ మాఫియా లక్షల కోట్లు వెనకేసుకోబోతోంది. కాబట్టి ఫాంటసీ లీగ్ యాప్స్‌కైనా, ఇలాంటి బెట్టింగ్ వ్యవహారాలకైనా దూరంగా ఉండటం మంచిది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు బెట్టింగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో అందరూ అప్రమత్తంగా ఉండడం మంచిదని పోలీసులు తెలియజేస్తున్నారు.
IPL Updates : బ్రాడ్‌కాస్టింగ్‌తో కాసుల వర్షం.. ఆ రైట్స్‌తో ఏకంగా రూ.కోట్లలో ప్రాఫిట్
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో పైసల వరద.. మంచి నీళ్లలా ఫ్రాంఛైజీల ఖర్చు