Wimbledon 2024 : సెమీస్‌కు దూసుకెళ్లిన అల్కరాజ్

వింబుల్డన్‌ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నాడు.

Update: 2024-07-09 19:26 GMT

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్‌ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నాడు. ఈ స్పెయిన్ స్టార్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అల్కరాజ్ 5-7, 6-4, 6-2, 6-2 తేడాతో అమెరికా ప్లేయర్ టామీ పాల్‌ను ఓడించాడు. అయితే, తొలి సెట్‌ను పాల్ గెలుచుకోవడంతో మొదట అల్కరాజ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి సెట్ కోల్పోయిన తర్వాత అతను బలంగా పుంజుకున్నాడు. మిగతా మూడు సెట్లను ఏకపక్షంగా గెలుచుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 7 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టిన అల్కరాజ్ 8సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. 51 అనవసర తప్పిదాలతో పాల్ మూల్యం చెల్లించుకున్నాడు.

మరోవైపు, టాప్ సీడ్ జెన్నిక్ సిన్నర్ ఆట క్వార్టర్‌లో ముగిసింది. రష్యా ప్లేయర్ మెద్వెదెవ్ అతన్ని ఇంటికి పంపించి సెమీస్‌కు చేరుకున్నాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మెద్వెదేవ్ 7-6(9-7), 4-6, 6-7(4-7), 6-2, 3-6 తేడాతో సిన్నర్‌పై విజయం సాధించాడు. 4 గంటలపాటు రసవత్తరంగా సాగిన ఈ పోరులో మెద్వెదెవ్ ఐదో సెట్‌లో గెలుపు రుచిచూశాడు. మెద్వెదెవ్‌తో పోలిస్తే ఏస్‌లు, విన్నర్లు సిన్నరే ఎక్కువగా బాదాడు. తప్పులు కూడా తక్కువగా చేశాడు. సిన్నర్ 4 డబుల్ ఫౌల్ట్స్, 45 అనవసర తప్పిదాలు చేయగా.. మెద్వెదెవ్ 11 డబుల్ ఫౌల్ట్స్, 49 తప్పిదాలు చేశాడు. అయితే, కీలక సమయాల్లో మెద్వెదెవ్ పట్టుదల ప్రదర్శించి విజయాన్ని అందుకున్నాడు.

మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో అన్‌సీడ్ క్రీడాకారిణి, క్రొయేషియాకు చెందిన డొన్నా వెకిక్ ఓ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వెకిక్ 5-7, 6-4, 6-1 తేడాతో ఆస్ట్రేలియా ప్లేయర్ లులు సన్‌పై విజయం సాధించింది. 7వ సీడ్ పాలిని 6-2, 6-1 తేడాతో అమెరికా క్రీడాకారిణి ఎమ్మా నవారో‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. 


Similar News