BWF Rankings : టాప్-10లోకి సాత్విక్-చిరాగ్ జోడి.. పీవీ సింధు ర్యాంకు ఎంతంటే..?
బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ టాప్-10లో చోటు దక్కించుకుంది.
దిశ, స్పోర్ట్స్ : బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ టాప్-10లో చోటు దక్కించుకుంది. భారత తరఫున అన్ని విభాగాల్లో టాప్-10లో చోటు దక్కించుకున్న జోడీగా వీరు నిలిచారు. తాజా ర్యాంకింగ్స్‌లో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారు. సాత్విక్ గాయం కారణంగా ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత వీరు పరిమిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ జోడీ వచ్చే సీజన్‌ను మాజీ కోచ్ టాన్ కిమ్‌హెర్ సారథ్యంలో ప్రారంభించనుంది.
త్రీషా-గాయత్రిలకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
భారత మహిళల డబుల్స్ జోడీ త్రీషా జాలీ-గాయత్రి గోపీచంద్ తమ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నారు. తాజాగా ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఈ జోడీ 11వ స్థానానికి చేరింది. గత వారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఈ జోడీ వరుస ప్రదర్శనలతో రెండు స్థానాలను మెరుగుపర్చుకుంది. సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీలో అద్భుతంగా రాణించి టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు 15 ర్యాంకుకు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 12 వ ర్యాంకులో, హెచ్ ఎస్ ప్రణయ్ 26వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ప్రియాంషు రజావత్(34), కిరణ్ జార్జ్(38) ర్యాంకులతో టాప్-40లో చోటు దక్కించుకున్నారు.