హేలీ మాథ్యూస్ విధ్వంసం.. రెండో టీ20లో భారత్‌కు షాక్

తొలి టీ20‌లో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు రెండో టీ20లో వెస్టిండీస్ మహిళలు షాకిచ్చారు.

Update: 2024-12-17 17:24 GMT

దిశ, స్పోర్ట్స్ : తొలి టీ20‌లో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు రెండో టీ20లో వెస్టిండీస్ మహిళలు షాకిచ్చారు. హేలీ మాథ్యూస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో విండీస్ భారీ విజయం సాధించింది. నవీ ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(62) తన ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేసింది. రోడ్రిగ్స్(13),ఉమా చెత్రి(4), రఘ్వి బెస్ట్(5) నిరాశపర్చడంతో 48పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన వేళ మంధాన కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకుంది. రిచా ఘోష్(32) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పోరాడే స్కోరు దక్కింది. విండీస్ బౌలర్లలో డియాండ్రా డాటిన్, హెన్రీ, హేలీ మాథ్యూస్, ఫ్లెచర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని విండీస్ అలవోకగా ఛేదించింది. 15.4 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్(85 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగింది.47 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు ఉండటం గమనార్హం. ఈ విజయంతో వెస్టిండీస్ టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. గురువారం సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జరగనుంది.


Tags:    

Similar News