KL Rahul : వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తా.. కేఎల్ రాహుల్ సక్సెస్ సీక్రెట్ రివీల్
డిఫెన్స్‌పై దృష్టి సారించడంతో పాటు తొలి 30 ఓవర్లు బౌలర్లను గౌరవిస్తా అని కేఎల్ రాహుల్ అన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : డిఫెన్స్‌పై దృష్టి సారించడంతో పాటు తొలి 30 ఓవర్లు బౌలర్లను గౌరవిస్తా అని కేఎల్ రాహుల్ అన్నాడు. భారత బ్యాట్స్‌మెన్లు ఇబ్బంది పడుతున్న వేళ అద్భుతంగా రాణించడంపై రాహుల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆటలో తన సీక్రెట్ రివీల్ చేశాడు. ‘అందరికీ ఆటలో ఎంచుకున్న ప్రణాళికలు ఉంటాయి. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు కొంత అదృష్టం కూడా కలిసిరావాలి. తొలి 10-15 ఓవర్లను పూర్తి చేసి కాస్త ఆత్మవిశ్వాసాన్ని పొందాలి. అనంతరం కోకబుర్ర బంతితో ఆస్ట్రేలియాలో పేస్, బౌన్స్‌ను ఆడటాన్ని ఆస్వాదించొచ్చు. కఠినమైన బంతులను వదిలేయాలి. బంతి పాతబడిన తర్వాత చాన్స్ తీసుకోవాలి. అదే నా ప్లాన్. అది చాలా సింపుల్. అదే ప్లాన్ అందరికీ వర్తిస్తుంది.’ అని రాహుల్ అన్నాడు. బుమ్రా-ఆకాష్ దీప్‌ల బ్యాటింగ్ ప్రదర్శనపై రాహుల్ స్పందిస్తూ.. ‘వారిద్దరు ఆడిన షాట్లను ఎంజాయ్ చేశా. లోయర్ ఆర్డర్ పరుగులు రాబట్టడం మంచి పరిణామం. టీం మీటింగ్స్‌లో ఇదే అంశంపై చర్చిస్తాం. బౌలర్లు బ్యాటింగ్‌లోనూ రాణించేందుకు కష్టపడ్డారు.’ అని చెప్పుకొచ్చాడు.
సెనా దేశాల్లో రాహుల్ మరో రికార్డు
సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 2020 తర్వాత అత్యధిక యావరేజ్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 10 ప్లస్ ఇన్నింగ్స్‌ల్లో 41.1 బ్యాటింగ్ యావరేజ్‌తో టాప్‌లో నిలిచాడు. పంత్ 34.8, రోహిత్ 33.2, కోహ్లీ 30.4 యావరేజ్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గబ్బా టెస్ట్ నాలుగో రోజు భారత్ ఫాలో ఆన్ గండం తప్పించుకోవడంలో రాహుల్(84) కీలక పాత్ర పోషించాడు.