రెండు దశల్లో ఐపీఎల్-2024?.. కసరత్తు మొదలుపెట్టిన బీసీసీఐ!
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని బోర్డు భావిస్తున్నది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2024 సమయంలోనే లోక్‌సభ ఎన్నికలు జరగుతుండటంతో లీగ్ నిర్వహణపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. టోర్నీని ఇండియాలో నిర్వహించాలా? లేదా బయట నిర్వహించాలా? అనే దానిపై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వంతో చర్చలు పూర్తయిన తర్వాతే స్పష్టత వస్తుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే, లీగ్ షెడ్యూల్ రూపొందించడంపై బోర్డు ఇప్పటికే దృష్టి పెట్టింది. మార్చి 22 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్టు విశ్వసనీయ సమాచారం. సరిగ్గా ఐపీఎల్ సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని బోర్డు భావిస్తున్నది.
రెండు దశల్లో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘ఐపీఎల్ షెడ్యూల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల తేదీలపై క్లారిటీ వచ్చేవరకూ వేచి చూస్తాం. దాన్ని బట్టి షెడ్యూల్‌ను ప్లాన్ చేయొచ్చు. ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ఆలస్యమైతే షెడ్యూల్‌ను దశల వారిగా ప్రకటిస్తాం. లీగ్ బయట జరగాలని ఎవరూ కోరుకోవడం లేదు. త్వరలోనే అన్ని ఖరారవుతాయి.’ అని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ మధ్యలో జనరల్ ఎలక్షన్స్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ రిలీజ్ అయితే కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరిగే రాష్ట్రాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. ఫిబ్రవరి మధ్యలో తొలి దశ షెడ్యూల్ బోర్డు రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ రెండో దశను విదేశంలో నిర్వహించాలనుకుంటే.. యూఏఈకి తరలించే అవకాశం ఉన్నట్టు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో లీగ్‌ను బోర్డు విదేశాల్లోనే నిర్వహించింది. 2009లో ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించగా.. 2014లో తొలి దశ మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే.