కుటుంబ విధానంపై బీసీసీఐ నిర్ణయం మారదు
భవిష్యత్‌లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాయితీలు కల్పించే విషయం బీసీసీఐ చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఉన్న నిబంధనలు మాత్రం ఎప్పటికీ అమలులో ఉంటాయని సైకియా స్పష్టం చేశారు.

- అవసరమైన సమయంలో కొన్ని రాయితీలు ఇస్తాం
- కఠినమైన మార్గదర్శకాలు పాతవే
- బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా
దిశ, స్పోర్ట్స్: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు పరాజయం తర్వాత బీసీసీఐ తీసుకొని వచ్చిన కఠినమైన మార్గదర్శకాలలో ఎలాంటి మార్పులు ఉండవని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులను వెంట తీసుకొని వెళ్లే విషయంలో బీసీసీఐ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకుంది. భారత జట్టు పర్యటన సమయంలో కుటుంబాన్ని వెంట తీసుకొని వెళ్లే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. దీనిపై భారత జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఓటమి ఎదురైనప్పుడు హోటల్ రూమ్‌లో ఒంటరిగా కూర్చొని ఏడవాలా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీసీసీఐ ఈ నిబంధనలను మారుస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. సమీప భవిష్యత్‌లో బీసీసీఐ మార్గదర్శకాలను మార్చే అవకాశం లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానమే కంటిన్యూ అవుతుంది. ఇది దేశానికి, మన టీమ్ఇండియాకు, బీసీసీఐకి అత్యంత ముఖ్యమైనదని సైకియా అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం ఉంది. బీసీసీఐ మార్గదర్శకాలపై కొంత ఆగ్రహం, భిన్నాభిప్రాయం ఉండొచ్చు. అయితే ఇది జట్టులోని సభ్యులకు అంటే ఆటగాళ్లు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది అందరికీ వర్తిస్తుందని అన్నారు.
బీసీసీఐ ప్రవేశపెట్టిన విధానం రాత్రికి రాత్రే రూపొందించబడలేదు. కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉంది. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కంటే ముందు కుటుంబాలను జట్టుతో పాటు అనుమతించలేదని ఆయన గుర్తు చేశారు. కేవలం వారిద్దరి సమయంలోనే విధానాలు మార్చుకున్నారని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆడే రోజుల నుంచి ఇప్పుడు ఉన్న విధానమే ఉందని సైకియా చెప్పారు. కోహ్లీ నిబంధనలపై అసంతృప్తి వ్యక్తం చేసినా.. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా అనేక రోజులు భారత క్రికెటర్ల కుటుంబాలు స్టేడియంలో ఉన్నాయని గుర్తు చేశారు. బీసీసీఐ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేస్తే వాళ్లు ఒకటి కంటే ఎక్కువ రోజులు మైదానంలో కనిపించే వారు కాదని సైకియా చెప్పారు. భవిష్యత్‌లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాయితీలు కల్పించే విషయం బీసీసీఐ చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఉన్న నిబంధనలు మాత్రం ఎప్పటికీ అమలులో ఉంటాయని సైకియా స్పష్టం చేశారు.