నకిలీ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్.. ఆకాశ రామన్న లేఖలో అసలు నిజం!

మెడల్స్ సాధించటంతోపాటు మెరుగైన ర్యాంకులు పొందటానికి కొంతమంది బ్యాడ్మింటన్ ​క్రీడాకారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ మేరకు సమాచారం అందగా కేసులు నమోదు చేసిన హైదరాబాద్ ​సీసీఎస్​పోలీసులు విచారణ చేపట్టారు.

Update: 2023-08-03 02:57 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మెడల్స్ సాధించటంతోపాటు మెరుగైన ర్యాంకులు పొందటానికి కొంతమంది బ్యాడ్మింటన్ ​క్రీడాకారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ మేరకు సమాచారం అందగా కేసులు నమోదు చేసిన హైదరాబాద్ ​సీసీఎస్​పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్‌కు సీసీఎస్​డీసీపీ లేఖ రాశారు. ఇలాంటి క్రీడాకారుల వల్ల క్రీడా స్ఫూర్తితో ఆడుతున్న ఆటగాళ్లు నష్టపోతున్నారని అందులో పేర్కొన్నారు. అడ్డదారులు తొక్కిన ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

ఆకాశ రామన్న లేఖతో...

కొన్ని రోజుల క్రితం సీసీసీ డీసీపీకి ఓ ఆకాశ రామన్న లేఖ అందింది. అందులో బ్యాడ్మింటన్​ క్రీడాకారులైన దావు వెంకటశివ నాగరాం మౌనిష్, భూక్యా నిషత్, ఏఆర్ రోహన్ ​కుమార్, హిమబిందు శ్యామలరావు, రేనుశ్రీ శ్యామలరావు, దీప్షిక నేరేడిమెల్లి బ్యాడ్మింటన్ ​అసోసియేషన్​ఆఫ్ ​ఇండియాకు తప్పుడు బర్త్ ​సర్టిఫికెట్లు సమర్పించినట్టుగా అందులో ఉంది. వీళ్లంతా తమ వాస్తవ వయసును దాచిపెట్టి తక్కువ వయసు కేటగిరీల్లో పోటీలు పడుతూ పతకాలు సాధించటంతోపాటు మెరుగైన ర్యాంకులు పొందుతున్నట్టుగా లేఖ రాసిన వ్యక్తి పేర్కొన్నాడు.

మరో 40మంది కూడా..

మరో నలభై మంది క్రీడాకారులు కూడా బ్యాడ్మింటన్ ​అసోసియేషన్ ​ఆఫ్ ​ఇండియాకు ఇలాగే నకిలీ బర్త్​ సర్టిఫికెట్లు సమర్పించినట్టుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది డాక్టర్ల పాత్ర ఉన్నట్టుగా కూడా తెలిపాడు. హైదరాబాద్​లోని వేర్వేరు కోచ్​ల సలహాలు, తమ పిల్లలు మెడల్స్​ గెలవాలన్న తల్లిదండ్రుల దురాశ కారణంగానే ఈ అక్రమాలకు పాల్పడినట్టుగా వివరించాడు. దీనివల్ల నిజమైన ప్రతిభ ఉన్న క్రీడాకారులు నష్టపోతున్నట్టు వివరించాడు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలుగా డాక్యుమెంట్లను కూడా లేఖకు జత చేశాడు.

విచారణలో తేలిన నిజాలు..

దీనిపై సీసీఎస్​ ఇన్ స్పెక్టర్ ​చంద్రకుమార్ ​విచారణ జరిపారు. దీంట్లో దావు వెంకటశివ నాగరాం మౌనిష్​ వాస్తవానికి 2006, జూన్​4న జన్మించగా అతను బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్ ​ఇండియాకు 2‌‌‌‌007, జనవరి 12న పుట్టినట్టు నకిలీ బర్త్ ​సర్టిఫికెట్ ​సమర్పించినట్టు తేలింది. ఇక భూక్యా నిషత్​ 2007, జనవరి 12న పుట్టగా 2010, అక్టోబర్​12న జన్మించినట్టుగా సర్టిఫికెట్ ​సమర్పించినట్టు నిర్ధారణ అయ్యింది. ఏఆర్ రోహన్ ​కుమార్​ 2005, అక్టోబర్ ​29న జన్మించగా 2007, జనవరి 29న పుట్టినట్టు సర్టిఫికెట్ ​దాఖలు చేసినట్టుగా తేలింది. ఇలా దాదాపు నలభై మంది తప్పుడు బర్త్​ సర్టిఫికెట్లు సమర్పించి తమ వాస్తవ వయసుకన్నా తక్కువ వయసు కేటగిరీల్లో పోటీలు పడుతున్నట్టుగా దర్యాప్తులో తెలిసింది. వీరిలో కొందరు బంగారు పతకాలు కూడా సాధించినట్టు, జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు పొందినట్టుగా భావిస్తున్నారు.

రెండునెలలైనా చర్యలేవీ?

వివరాలన్నింటినీ ఆధారాలతో సహా పుల్లెల గోపీచంద్​కు అందజేసిన సీసీఎస్​ పోలీసులు అక్రమాలకు పాల్పడిన ఆటగాళ్లపై అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ సిఫార్సు చేసింది. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ ​విదేశాల్లో ఉన్నారని, స్వదేశానికి రాగానే ఆయన దీనిపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. అయితే, సీసీఎస్ ​పోలీసులు అక్రమాలకు పాల్పడ్డ ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని లేఖ రాయటంతోపాటు విచారణలో సేకరించిన ఆధారాలను పంపించి రెండు నెలలు గడిచినా తెలంగాణ బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ స్పందించకపోవటం గమనార్హం.

Tags:    

Similar News