Asian Athletics Championship 2023: ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్ శుభారంభం.. 10 వేల మీటర్ల నడకలో కాంస్యం..

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2023లో భారత్ శుభారంభం చేసింది.

Update: 2023-07-12 15:14 GMT

బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2023లో భారత్ శుభారంభం చేసింది. తొలి రోజు 10 వేల మీటర్ల నడక పోటీలో అభిషేక్ పాల్ కాంస్య పతకం సాధించాడు. గమ్యాన్ని 29 నిమిషాల 33.26 సెకన్లలో పూర్తి చేసిన అభిషేక్ మూడో స్థానంలో నిలిచాడు. జపాన్‌కు చెందిన రెన్ తజావా (29.18.44) స్వర్ణ పతకం, కజకిస్థాన్‌కు చెందిన కోచ్ కిముతాయ్ షడ్రా (29:31.63) రజత పతకం సాధించారు. మన దేశానికి చెందిన గుల్వీర్ సింగ్ ఐదో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల రన్నింగ్‌లో ఐశ్వర్య మిశ్రా ఫైనల్‌కు అర్హత సాధించింది. గమ్యాన్ని ఆమె 53.58 సెకన్లలో పూర్తి చేసింది. ఆమె వ్యక్తిగత అత్యుత్తమం 51.18 సెకన్లు. పురుషుల 400 మీటర్ల రన్నింగ్‌లో రాజేష్ రమేష్, మహ్మద్ అజ్మల్ ఫైనల్‌కు అర్హత సాధించారు.

గమ్యాన్ని రాజేష్ 45.91 సెకన్లలో, అజ్మల్ 45.75 సెకన్లలో పూర్తి చేశారు. మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో అన్నూ రాణి నాలుగో స్థానంతో సరిపుచ్చుకుంది. జాతీయ రికార్డు హోల్డర్ అయిన అన్నూ 59.10 మీటర్ల దూరం మాత్రమే విసిరింది. మహిళల 1500 మీటర్ల ఈవెంట్‌ను లిల్లీదాస్ 4 నిమిషాల 27.61 సెకన్లలో పూర్తి చేసి ఏడో స్థానంతో సరిపుచ్చుకుంది. 16వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో డెకాథ్లాన్‌లో తొలి అంతర్జాతీయ పతకం సాధించిన తేజస్విన్ శంకర్‌ గురువారం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.


Similar News