Asia Cup 2023: జై షాతో పీసీబీ చైర్మన్‌ భేటి.. ఆసియా కప్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Update: 2023-07-12 10:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన జకా అష్రఫ్‌.. ఆసియా కప్‌ హైబ్రీడ్‌ మోడల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఆసియా కప్‌ 2023 జరగనుంది. తాజాగా పీసీబీ చైర్మన్‌ జకా అష్రఫ్‌.. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) అధ్యక్షుడు జై షాతో భేటి అయ్యాడు. సోమవారం రాత్రి ఇద్దరు దుబాయ్‌లో కలుసుకొని ఆసియా కప్‌ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని స్వయంగా పీసీబీ చైర్మన్‌ జకా అష్రఫ్‌ జైషాకు వెల్లడించారు. దీంతో ఆసియా కప్‌ నిర్వహణకు మార్గం సుగమమైంది.

ఇదే విషయమై పీసీబీ చీఫ్‌ మాట్లాడుతూ.. ''జై షాతో మీటింగ్‌ మంచి ఆరంభం. ఆసియా కప్‌ హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించడం మాకు ఓకే. ఇక రానున్న కాలంలో భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ మైత్రి బంధం బలపడే అవకాశముంది. రిలేషన్స్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం'' అంటూ తెలిపాడు. ఈ శుక్రవారం ఆసియా కప్‌ 2023 పూర్తి షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది. ఈసారి ఆసియా కప్‌ హైబ్రీడ్‌ మోడల్‌లో జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లు ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో.. మరో తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.


Similar News