Asia Cup 2023: ఈ వారంలో ఆసియా కప్ షెడ్యూల్.. భారత్, పాక్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) రోజుకో అడ్డుపుల్ల వేస్తుండటంతో ఆసియా కప్ షెడ్యూల్ ఆలస్యమవుతున్నది.

Update: 2023-07-17 16:20 GMT

న్యూఢిల్లీ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) రోజుకో అడ్డుపుల్ల వేస్తుండటంతో ఆసియా కప్ షెడ్యూల్ ఆలస్యమవుతున్నది. అయితే, ఈ వారంలో ఆసియా కప్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌‌లో భాగంగా ఆసియా కప్ మ్యాచ్‌లు ఆతిథ్య పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో నిర్వహించనున్నారు. భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌లు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు సమాచారం. టోర్నీలో కనీసం ఇరు జట్లు రెండుసార్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న ఇరు జట్లు తొలి మ్యాచ్ ఆడనుండగా.. సెప్టెంబర్ 10వ తేదీన మరోసారి ఎదురుపడతాయని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది.

ఈ రెండు మ్యాచ్‌లు దంబుల్లా, కాండీలో జరగనున్నట్టు పేర్కొంది. అయితే, టోర్నీలో భారత్, పాక్ జట్లు మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కూడా ఉంది. గ్రూపు దశలో సత్తాచాటి ఇరు జట్లు నాకౌట్‌కు చేరుకుంటే అక్కడ మూడోసారి.. ఫైనల్‌కు చేరుకుంటే నాలుగోసారి భారత్, పాక్ జట్ల మధ్య పోరు చూడొచ్చు. అయితే, పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయితేనే దాయాదుల మ్యాచ్‌లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.


Similar News